నేడు రాష్ట్ర పరిశీలకుడి రాక
విద్యారణ్యపురి: సురక్షిత, శుభ్రమైన పాఠశాల 5.0 కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు రాష్ట్ర పరిశీలకుడు హైదరాబాద్‌లోని డైట్ ప్రిన్సిపాల్ రవికాంత్ నేటి (సోమవారం) నుంచి 22వ తేదీ వరకు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సురక్షిత, పరిశుభ్ర వాతావరణం కల్పించేందుకు ‘సురక్షిత, శుభ్రమైన పాఠశాల 5.0’ కార్యక్రమం హనుమకొండ జిల్లాలో గత నెల 31న ప్రారంభమై ఈనెల 25 వరకు కొనసాగనుంది. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభు త్వ యాజమాన్యాల పాఠశాలలను రవికాంత్ సందర్శించి ఆయా పాఠశాలల్లో హెచ్‌ఎంలు అమలు చేసే రోజువారీ కార్యాచరణ ప్రణాళిక ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలు కూడా పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం డీఈఓ, ఎంఈఓలతో సమీక్షించనున్నారు.
21 నుంచి స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ తరగతులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో 40 రోజులపాటు స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సు తరగతులు ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ మేఘనరావు తెలిపారు. ఈతరగతులు ఇంగ్లిష్ విభాగంలోని సెల్ట్ కార్యాలయంలో సాయంత్రం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్యాంపస్ విద్యార్థులు రూ.200, ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కార్యాలయంలో నాన్ యూనివర్సిటీ ఫండ్ అకౌంట్‌లో ఈనెల 20లోపు చెల్లించి కోర్సులో చేరవచ్చని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి డిసెంబర్ 31 వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. బాలసముద్రం, అడ్వకేట్స్ కాలనీ, భీష్మనగర్, హంటర్ రోడ్డు, వరంగల్ పబ్లిక్ స్కూల్, జూపార్కు ప్రాంతంలో ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా వరంగల్ టౌన్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. రెడ్డిపాలెం, మొగిలిచర్ల, కొత్తపేట ఇండస్టీరియల్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) గ్రీవెన్స్ సెల్ సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నగర ప్రజలు గ్రీవెన్స్ సెల్ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
వరంగల్ కలెక్టరేట్‌లో..
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సకాలంలో వచ్చి వినతులు అందించాలని కోరారు.
అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో కార్తీక మాసోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ఆదివారం జరిగిన కార్యక్రమంలో చిన్నారుల కూచిపూడి నృత్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. లక్ష్మీవేంకటేశ్వర సేవా సమితి మహిళలు, ఆలయ సిబ్బంది కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.


