రైతుల సమస్యలు పరిష్కరించాలి
వరంగల్ / ఖిలా వరంగల్: పత్తి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సీసీఐ అధికారులు పరిష్కరించాలని తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ శివనగర్‌లోని సీసీఐ వరంగల్ రీజినల్ కార్యాలయం ఎదుట తెలంగాణ పత్తి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమతో నిమిత్తం లేకుండా సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని, ఎక్కడైనా స్వేచ్ఛగా విక్రయించే అవకాశం కల్పించాలని కోరారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై 11 శాతం సుంకాన్ని ఎత్తివేయడాన్ని వెనక్కి తీసుకోవాలని, కపాస్ కిసాన్ యాప్ అమలును ఉపసంహరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కోకన్వీనర్ కృష్ణారెడ్డి, చెల్పూరు రాము, శోభన్ పాల్గొన్నారు.


