రహదారులు రక్తసిక్తం
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం రహదారులు రక్తసిక్తంగా మారాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన ఒకరు, జనగామ జిల్లా రఘునాథపల్లి జాతీయ రహదారిపై గోవర్దనగిరి దర్గా సమీపంలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు, గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన మహిళ దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన రాజయ్య (48) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొయ్యూరు ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. మంథనిలో పెళ్లి ఉండటంతో రాజయ్య ఈనెల 13న తన బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మంథని నుంచి పెద్దతూండ్లలోని ఓ ఇంట్లో జరిగిన కార్యక్రమానికి వెళ్లాడు. ఈక్రమంలో బైక్‌పై ఇంటికి వస్తుండగా పెద్దతూండ్ల రోడ్డు పక్కన ఉన్న పొలంలో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు శుక్రవారం ఘటన స్థలానికి వెళ్లి చూడగా రాజయ్య మృతిచెంది ఉన్నట్లు ఎస్సై చెప్పారు. రాజయ్య భార్య ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
గూడ్స్ వాహనం ఢీకొని యువకుడు..
రఘునాథపల్లి : బైక్‌ను వాహనం ఢీకొన్న సంఘటనలో యువకుడు మృతిచెందాడు. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన రఘునాథపల్లి జాతీయ రహదారిపై గోవర్దనగిరి దర్గా సమీపంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన బిర్రు రవి మరో వ్యక్తి రాపాక వినోద్ (29)తో కలిసి బైక్‌పై హైదరాబాద్ వెళ్తున్నాడు. కాగా గోవర్దనగిరి దర్గా సమీపంలో వెనకాల అతి వేగంతో వచ్చిన గూడ్స్ వాహనం.. కారును ఢీకొంటూ వెళ్లి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వెనకాల కూర్చున్న వినోద్ ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందగా, బిర్రు రవికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
గృహప్రవేశానికి వెళ్తూ.. అనంత లోకాలకు..
దుగ్గొండి : నూతన గృహప్రవేశానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. గీసుగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన గద్దె గోపాల్‌రావు–హనుమాయమ్మ (55) దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం నర్సంపేట మండలం మర్రినర్సయ్యపల్లి గ్రామంలోని గోపాల్‌రావు బంధువులు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి దంపతులు బైక్ పై వెళ్తున్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావి దాటగానే వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై మద్యం షాపు సమీపంలో వెనక నుంచి ఓ బొలెరో వాహనం స్వల్పంగా ఢీకొట్టి వెళ్లి పోయింది. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో హనుమాయమ్మ రోడ్డు పై పడిపోగా గోపాల్‌రావు పక్కకు పడ్డాడు. ఇదే సమయంలో వెనకనుంచి వేగంగా వస్తున్న లారీ హనుమాయమ్మ నడుముపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే తుదిశ్వాస విడిచింది. గోపాల్‌రావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై రా వుల రణధీర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నర్సంపేట మార్చురీకి తరలించారు. లారీని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.బోలెరో వాహనం జాడ తెలియాల్సి ఉంది.
రహదారులు రక్తసిక్తం
రహదారులు రక్తసిక్తం
రహదారులు రక్తసిక్తం


