కొలనులో బీజేపీ పడవ ప్రయాణం
● వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మిత స్థలంలో నాయకుల నిరసన
వరంగల్ చౌరస్తా : వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్ నిర్మిత ప్రాంతంలోని కొలనులో గురువారం బీజేపీ నాయకులు పడవలు నడిపి వినూత్నంగా నిరసన తెలిపారు. ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పడవలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి కొండా సురేఖ, మాజీ సీఎం కేసీఆర్‌కు ఈ కొలనులో ఉచిత పడవ ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.బీబిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం వల్ల వరంగల్ ప్రజలు బస్టాండ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరంగల్ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాయల మరాఠీ పార్టీలని మండిపడ్డారు. వరంగల్ బస్టాండ్ పేరుతో మాజీ ఎమ్మెల్యే నయవంచన చేస్తే.. ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ అసమర్థతతో నిర్మాణానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హృదయ్, అమత్, స్మార్ట్ సిటీ వంటి ఎన్నో పథకాలకు భారీగా నిధులు కేటాయించి వరంగల్‌ను ప్రగతిదారిలో నడిపిస్తుంటే గతంలో బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం ఓరుగల్లు చరిత్రను భ్రష్టు పట్టించాయని విమర్శించారు. పేదల భూముల్ని కబ్జా చేయడంలో.. సెటిల్‌మెంట్ పనుల్లో ఆ పార్టీల నేతలు బీజీబిజీగా ఉన్నారని, ఇక వారికి ప్రజా సమస్యలు ఏం పడతాయంటూ ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎరబ్రెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.


