 
															శభాష్ పోలీస్
వరంగల్ క్రైం: మోంతా తుపాన్ తాకిడికి ట్రైసీటి ప్రాంతాలు నీట మునిగాయి. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పోలీసులు రోడ్లపై విధులు నిర్వహించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీస్ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత వర్షం తీవ్రత పెరగడంతో ప్రధాన రోడ్లపై వరద పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొన్ని వాహనాలు వరద ఉధృతికి రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో వర్షంలో తడుస్తూనే ట్రాఫిక్ క్లియర్ చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి ఎన్‌ఐటీ పెట్రోల్ బంక్, బ్లూ డైమండ్ బార్ అండ్ రెస్టారెంట్ సమీపం, సీఎస్‌ఐర్ గార్డెన్, కేయూ పరిదిలో చింతగట్టు దగ్గర ఓఆర్‌ఆర్ రోడ్డు కింద పెద్ద ఎత్తును నీరు నిలవడంతో జేసీబీల సాయంతో డివైడర్లను తొలగించారు.
సురక్షి ప్రాంతాలకు...
నీట మునిగిన ప్రాంతాల నుంచి బాధితులను పోలీసులు వారి వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి అంబేడ్కర్ భవన్‌లో ఓ వివాహానికి హాజరైన జనం హాల్ నుంచి బయటకు వచ్చే సరికి రోడ్డుపై నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పోలీసులు రెస్క్యు బృందాలతో సుమారు 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి మూగ, చెవిటి పాఠశాల నుంచి విద్యార్థులను, సీఎస్‌ఆర్ గార్డెన్ సమీపంలో గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేయూ పరిధి భగత్‌సింగ్ నగర్ కాలనీ వాసులను సాయి పంక్షన్‌హాల్‌కు తరలించారు. రాంనగర్‌లో ఓ కుటుంబం అంతా నీళ్లలో ఇరుక్కుపోవడంతో వారిని బంధువుల ఇంటికి తరలించారు.
పోలీసుల సేవలకు ప్రశంసలు..
బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా వరంగల్ కమిషనరేట్‌కు చెందిన పోలీసులు శ్రమించారు. దీంతో పోలీసుల సేవలకు ప్రజలు ప్రశంసలు కురిపించారు. హనుమకొండ–హైదరబాద్ ప్రధాన రాహదారి వెంట పోలీసులు పదుల సంఖ్యలో జేసీబీ వాహనాలను, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అంబులెన్సులను అందుబాటులో ఉంచుకుని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వర్తించారు.
వరద బాధితులను సురక్షిత
ప్రాంతాలకు తరలింపు
గంటల తరబడి రోడ్డుపైనే విధులు
ముంపు ప్రాంతాలను నుంచి ప్రజల తరలింపు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
