గ్రేటర్ వరంగల్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరం మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ‘మోంథా’ ఎఫెక్ట్‌తో కురిసిన కుండపోత వర్షంతో నగర జీవనం అతలాకుతలమైంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన ఎడతెరపి లేని వర్షానికి మహానగరం తడిసి ముద్దయ్యింది. భారీ వర్షం.. వరదలతో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షం ధాటికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు, గుడిసెల్లోకి వరదనీరు చేరడంతో సామగ్రి, గృహోపకరణాలు తడిసిపోయాయి. ఇంట్లో నీటిని ఎత్తిపోస్తూ రాత్రంతా జాగారం చేశారు.
ముసురుగా మొదలై... కుండపోత
మోంథా తుపాను ఉదయం నుంచి రాత్రి వరకు తెరిపినివ్వలేదు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో భారీ వానతో లోతట్టు కాలనీలకు సంబంధాలు తెగిపోయాయి. రహదారులన్నీ గోదారులను తలపించాయి. డ్రెయినేజీలు, నాలాలు పొంగి ప్రవహించాయి. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్‌హోల్స్ తెరుచుకుని ఉన్నాయో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
వరద కష్టాల్లో కాలనీల వాసులు
వరంగల్ అండర్ బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి, పాత బీట్ బజార్, ఎస్‌వీఎన్ రోడ్డు, వేంకటేశ్వర ఆలయం రోడ్డు, స్టేషన్ రోడ్డు, కొత్తవాడ 80 ఫీట్ల రోడ్డు, భద్రకాళి రోడ్డులోని సరస్వతీ కాలనీ, ములుగు రోడ్డు, హంటర్ రోడ్డు సంతోషిమాత కాలనీ, ఎన్టీఆర్ నగర్, బృందావన కాలనీ, కాశిబుగ్గ ఎస్‌ఆర్ నగర్, తదితర ప్రాంతాలు వాగులుగా మారాయి. అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని సాకరాశికుంట, కాశీకుంట, నాగేంద్ర కాలనీ, డీకే నగర్, శివనగర్‌లోని పలు ప్రాంతాల్లోని రహదారులు నీట మునగడంతోపాటు ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థల పాలయ్యారు. హనుమకొండలోని భీమారం, రాంనగర్, హనుమకొండ చౌరస్తా, ఆర్టీసీ బస్ స్టేషన్, సుబేదారి, గోకుల్ నగర్, అంబేడ్కర్ భవన్, ఎన్జీఓస్ కాలనీ ఇళ్లలో వరద నీరు చేరింది. కాజీపేట బంధం చెరువు సమీపంలో ఉన్న కాలనీల ఇళ్ల వద్దకు నీళ్లు చేరాయి. ప్రధాన నాలాల ద్వారా వరద నీరు వెళ్లకపోగా.. నేరుగా కాలనీల్లోకి ప్రవేశించాయి. ఇంకా ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపించాయి. రహదారులపైకి నీరు చేరడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు రహదారుల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. దీంతో బల్దియా డీఆర్‌ఎఫ్ సిబ్బంది తొలగించి, రాకపోకలు సవ్యంగా సాగేలా చర్యలు చేపట్టారు.
చెరువులను తలపించిన కాలనీలు..
లోతట్టు ప్రాంతాలు జలమయం
హనుమకొండ, వరంగల్, కాజీపేట
ట్రై సిటీలో వర్ష బీభత్సం
ఇళ్లు, గుడిసెల్లోకి చేరిన వరద
తడిసిన టీవీలు, ఫ్రిజ్‌లు,
విలువైన సామగ్రి
నిండా ముంచిన ‘మోంథా’
వరద కట్టిన వాన
వాగులను తలపించిన రోడ్లు,
డ్రెయినేజీలు.. స్తంభించిన రవాణా
తెరిపిలేని వానతో జనజీవనం అస్తవ్యస్తం
గ్రేటర్ వరంగల్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం
గ్రేటర్ వరంగల్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం


