 
															వరద బాధితులకు ఆశ్రయం
● 3,000 మందికి పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక ఏర్పాట్లు
● మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: మహానగర వ్యాప్తంగా జలమయమైన కాలనీల్లోని 3 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. గురువారం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో సహాయక చర్యలను వారు పరిశీలించారు. గోపాల్‌పూర్, అమరావతి నగర్ సమ్మయ్య నగర్, టీవీ టవర్ కాలనీ, శాంతినగర్, వాజ్‌పేయి కాలనీ, వరంగల్‌లోని హంటర్ రోడ్డు, పోతన రోడ్డు, శివనగర్, బీరన్నకుంట తదితర ప్రాంతాలను పరిశీలించి బాధితులకు భరోసా కల్పించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తుపాను దృష్ట్యా బల్దియా పరిధి హనుమకొండలో 4, వరంగల్ పరిధిలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాగునీరు, ఆహారం, రక్షణ కోసం దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గే వరకు గృహాలకు వెళ్లొద్దని ప్రభుత్వ పరంగా అన్ని వసతులు అందిస్తామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
