 
															బోట్లు వచ్చాయి.. ప్రాణాలు నిలిచాయి!
● ఊపిరి పీల్చుకున్న సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు
● సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్‌ఎఫ్,
ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
కాజీపేట అర్బన్: ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న 470 మంది విద్యార్థులను గురువారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హంటర్ రోడ్డులోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలోకి బుధవారం అకస్మాత్తుగా వరద ముంచెత్తింది. రాత్రి 9 గంటల ప్రాంతం తర్వాత బొందివాగు ఉప్పొంగడంతో నీరు కళాశాల భవనంలోకి వచ్చింది. కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశాల మేరకు కళాశాల ప్రిన్సిపాల్ గోలి శ్రీలత విద్యార్థినులను రాత్రి 8 గంటలకు భోజనం తర్వాత భవనంలోని ఫస్ట్ ఫ్లోర్‌కు చేర్చారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భవనంలోకి నీరు రావడంతో విద్యార్థినులు భయాందోళనలకు గురయ్యారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ.. గడిపారు. ఉదయం ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెండు బోట్ల సాయంతో విద్యార్థులను రక్షించారు. అదేవిధంగా మెడికవర్ హాస్పిటల్ వెనుకాల నివాసం ఉంటున్న ఓ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వసతి నిమిత్తం విద్యార్థులను వివిధ ప్రాంతాల్లోని సోషల్ వెల్ఫేర్ కళాశాలలకు తరలించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించి డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సూచనలిచ్చారు. తహసీల్దార్లు భావ్‌సింగ్‌నాయక్, కిరణ్ కుమార్, సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్, కార్పొరేటర్ మామిండ్ల రాజు, రెవెన్యూ, మున్సిపల్, డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక సేవల్లో పాల్గొన్నారు.
 
							బోట్లు వచ్చాయి.. ప్రాణాలు నిలిచాయి!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
