ఈ పాపం ఎవరిది? | - | Sakshi
Sakshi News home page

ఈ పాపం ఎవరిది?

Oct 31 2025 8:23 AM | Updated on Oct 31 2025 8:23 AM

ఈ పాప

ఈ పాపం ఎవరిది?

ఈ పాపం ఎవరిది?

ఏటా మునుగుడే..

చిన్నపాటి వర్షానికే గ్రేటర్‌ వరంగల్‌ అతలాకుతలం

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

వర్షాలు పడితే వడ్డేపల్లినుంచి వరంగల్‌కు వెళ్లే ప్రధాన నాలా పొంగిపొర్లడంతో నయీంనగర్‌ వంతెన సమీ పంలో రాకపోకలు నిలిచిపోతున్న కారణంగా పెద్దమొత్తంలో నిధులు వెచ్చించి కొత్త వంతెనను నిర్మించారు. ఆ వంతెన సమీపంలో ఆక్రమణలున్నాయని గతంలో హద్దులు పెట్టి.. ఇప్పుడు అదే ప్రదేశంలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పెద్ద భవనం నిర్మించారు.

హనుమకొండ గోపాల్‌పూర్‌ ఏరియాలో కాకతీయులకాలం నాటి ఆరు చెరువులు మాయమయ్యాయి. ఏళ్ల కిందట ఆక్రమణలకు గురైన ఆ చెరువుల స్థానంలో ఇళ్లు, కాలనీలు వెలిశాయి. ఆక్రమణలను నియంత్రించకపోవడం వల్ల బుధవారం కురిసిన వర్షానికి ఆ చెరువు మూడు చోట్ల తెగింది. వరద ప్రవాహానికి సుమారు 10 కాలనీలు ముంపునకు గురయ్యాయి.

...ఇలా గ్రేటర్‌ వరంగల్‌లోని ప్రధాన నాలాలు, వాటి పరిసరాలు ఆక్రమణలకు గురి కావడం వల్ల వరద ఇళ్లలోకి వస్తోంది. చిన్నపాటి వర్షానికే నగరం అతాలాకుతలమవుతోంది. స్మార్ట్‌సిటీ, అమృత్‌.. తదితర పథకాల కింద అభివృద్ధి పేరిట రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. చినుకు పడితే కాలనీలు చిత్తడి చిత్తడవుతున్నాయి. ఇందుకు ప్రధాన చెరువులు, నాలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలే కారణమని తేలినా.. చర్యలు తీసుకోవడం లేదు. గత బీఆర్‌ఎస్‌ హయాంనుంచి నేటి కాంగ్రెస్‌ వరకు శాశ్వత వరద ముంపు నివారణ చర్యలు చేపడతామంటూ చెబుతున్నారే తప్ప ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. ప్రజలు మాత్రం వర్షం పడినప్పుడల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

నగరంలో ఇదీ నాలాల దుస్థితి..

వరంగల్‌ ట్రైసిటీలో మొత్తం 20 నాలాలున్నాయి. కానీ ప్రధానంగా మూడు నాలాలు పెద్దవి. ముఖ్యంగా నయీంనగర్‌ నాలా 12.09 కిలోమిటర్ల నిడివితో ఉండగా, రంగంపేట నాలా 7 కిలోమీటర్లు, బొందివాగు నాలా 5.46 కిలోమీటర్లు. మొత్తంగా మూడు నాలాలు 24.55 కిలోమీటర్లతో విస్తరించి ఉన్నాయి. కట్టమల్ల నుంచి చిన్నవడ్డేపల్లి చెరువు నాలా రూపురేఖలు లేకుండా పోయాయి. వంద అడుగులు ఉండాల్సిన నాలాలు అక్కడక్కడా 20 నుంచి 30 అడుగులు కాగా, కొన్ని చోట్ల 50 అడుగులకు పరిమితమయ్యాయి. గత ఏడాది భారీ వర్షాలతో 4 నాలాల్లో 415 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. వివిధ శాఖలతో కూడిన స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ 50 శాతం ఆక్రమణలను తొలగించారు. మిగిలినవి వదిలేశారు. వంద అడుగులుగా విస్త్తరించాల్సిన నాలాలను అక్కడక్కడా చేపట్టి మార్గమధ్యలోనే నిలిపేశారు.

డక్ట్‌ కోసం సుమారు రూ.100 కోట్లు..

తరచూ మంపునకు గురవుతుందని హనుమకొండలోని సమ్మయ్యనగర్‌ సమీపంలో అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ వరదకాల్వల నిర్మాణం చేపట్టారు. కాకతీయ యూనివర్సిటీ – 100 ఫీట్ల రోడ్డును ఆనుకునే 2021లో ఆ డక్ట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.49 కోట్ల అంచనాలతో మొదలైన ఈ పనులు పూర్తయ్యేనాటికి రూ.100 కోట్ల వరకు చేరింది. గత ఏడాది పనులు పూర్తికాగా, బుధవారం కురిసిన భారీ వర్షానికి అటు నాలాల నీరు.. ఇటు గోపాల్‌పూర్‌ చెరువు ద్వారా వచ్చే వరదనీరు డక్ట్‌ వద్ద పొంగిపొర్లడంతో అమరావతినగర్‌, సమ్మయ్యనగర్‌, ‘కుడా’ ఎన్‌క్లేవ్‌ తదితర సుమారు 10 కాలనీలు గురువారం మధ్యాహ్నం వరకు నీటిలోనే ఉన్నాయి.

తరచూ మునుగుతున్న దుస్థితి

‘నాలా’లు సమస్తం.. కబ్జాల పర్వం

అక్కరకు రాని రూ.వందల కోట్ల

అభివృద్ధి

డక్ట్‌ గేట్లు తెరుచుకోక

నీటి మునిగిన కాలనీలు

ఆ డక్ట్‌ కోసం స్మార్ట్‌ సిటీ, ఆర్‌అండ్‌బీ నిధులు రూ.100 కోట్లు

రాజకీయ క్రీనీడలో

నగరవాసులే బలిపశువులు

వరంగల్‌ మహానగరం జలదిగ్భంధం కావడం ఐదేళ్లలో ఇది రెండోసారి. 2020 సెప్టెంబర్‌లో కురిసిన వర్షానికి ఐదు రోజులపాటు నగరం నీటిలో ఉంది. 2007, 2012, 2013, 2016 సెప్టెంబర్‌ మూడో వారంలో ఏకధాటిగా ఐదు రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి నగరం నీట మునిగింది. 2020 సెప్టెంబర్‌.. ఇప్పుడు బుధవారం కురిసిన వర్షానికి ముంపు తప్పలేదు. ఇళ్లల్లోకి వరద నీరు చేరి, రాకపోకలు స్తంభించిపోయాయి. గత వరదల సమయంలోనే స్పందించిన అప్పటి ప్రభుత్వాలు గ్రేటర్‌, ‘కుడా’ రెవెన్యూ, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులను, సిబ్బందితో ఏర్పాటయిన స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని సీరియస్‌గా హెచ్చరించాయి. 2020 సెప్టెంబర్‌ నాలుగో వారంనుంచి నాలాల వాస్తవ స్థలాలు, మార్కింగ్‌, తాత్కాలిక నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. మూడు నాలాల పొడవు 25 కిలోమీటర్లు ఉండగా.. కేవలం 5 కిలోమీటర్ల నిడివితో సర్వే చేశారు. నయీంనగర్‌, బొందివాగు, రంగంపేట, అలంకార్‌ బ్రిడ్జి మూడు నాలాల్లో కేవలం 5 కిలోమిటర్ల పరిధిలో నాలాల స్థలాల కబ్జాలు, ఆక్రమణలు గుర్తించారు. నాలలపై 162 తాత్కాలిక నిర్మాణాల్ని కూల్చేశారు. మరో 71 భవనాలకు నోటీసులు జారీ చేశారు. ఇక అంతటితోనే సరిపెట్టుకున్నారు. ఏడాదిన్నర కాలంగా నాలాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా వరంగల్‌ నగరం మళ్లీ వరదల్లో చిక్కుకుని భారీగా నష్టం జరిగిందని చర్చ జరగుతోంది.

హనుమకొండ సమ్మయ్యనగర్‌ నుంచి డక్ట్‌ నిర్మాణం చేపట్టిన సమయంలో రంగ్‌ బార్‌ నుంచి రాజాజీ నగర్‌ వెళ్లే దారిలో ప్రధాన నాలాకు ఓ కన్వెన్షన్‌ హాల్‌కు మధ్యన ఇలా ఉండేది.. ఇప్పుడు ఆ కన్వెన్షన్‌ హాల్‌ నాలా పక్కన చేరింది. ఫలితంగా ఇక్కడ నాలా వంతెన పై నుంచి పొంగి వరద కాలానీల్లోకి వస్తోంది.

ఈ పాపం ఎవరిది?1
1/4

ఈ పాపం ఎవరిది?

ఈ పాపం ఎవరిది?2
2/4

ఈ పాపం ఎవరిది?

ఈ పాపం ఎవరిది?3
3/4

ఈ పాపం ఎవరిది?

ఈ పాపం ఎవరిది?4
4/4

ఈ పాపం ఎవరిది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement