 
															హంటర్‌రోడ్డు కాలనీలకు ముంపు ముప్పు
● బొందివాగు నాలాకు పోటెత్తిన వరద
● జలదిగ్భంగా మారడంతో రాకపోకలు బంద్
వరంగల్ చౌరస్తా: వరంగల్ హంటర్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు కాలనీలకు వరద ముంపు ప్రమాదం పొంచి ఉంది. బుధవారం కురిసిన వానతో సంతోషిమాతకాలనీ, ఎన్‌టీఆర్‌నగర్, సాయినగర్, బృందవన కాలనీ జలమయమయ్యాయి. ఎగువన ఉన్న కొండపర్తి చెరువు కట్ట తెగడంతో భట్టుపల్లి, కొత్తపల్లి చెరువులకు వరద నీరు భారీగా చేరుతోంది. ఈ చెరువులు కూడా మత్తడి పోస్తే బొందివాగుపై వరద నీరంతా నేరుగా చేరుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయపడుతున్నారు. సుమారు 120 మంది కుటుంబాలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రానికి తరలివెళ్లాయి. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లకు నీళ్లు రావడంతో మొదటి, రెండు అంతస్తుల్లో బస చేస్తున్నారు. మరికొంత మంది బంధువులు, మిత్రుల ఇళ్లకు బయలుదేరి వెళ్లారు. బొంది వాగు నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్లు, డివైడర్, డ్రెయినేజీ కనిపించడం లేదు. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పెట్రోల్ బంక్‌లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఇళ్లలోకి వరద నీళ్లు చేరాయి. ఎప్పుడు ఎలాంటి ముంపు ప్రమాదం పొంచి ఉంటుందోనని హంటర్ రోడ్డు పరిసర ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా అధికారులు మాత్రం సహాయక చర్యలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
