ఆటోలు ఢీ.. ఐదుగురికి గాయాలు
● క్షతగాత్రులను ఎంజీఎంకు తరలింపు
ఖిలా వరంగల్ : వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ఆటో అతివేగంగా వెళ్తూ ముందు వెళ్తున్న ఆటోతో పాటు బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు, ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఓ వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని నాయుడు పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మామునూరు నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఆటోను మద్యం మత్తులో డ్రైవర్ అతివేగంగా నడుపుతూ ఇద్దరు ప్రయాణికులతో ముందు వెళ్తున్న ఆటోను, ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, ఒక ద్విచక్రవాహన దారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిలో పర్వతగిరి మండలం చింతనెక్కొండకు చెందిన కుడికాల వర్షిత (20), హనుమకొండ గుండ్లసింగారానికి చెందిన గుగులోత్ రాజేందర్ (32) ప్రయాణికులు కాగా.. ప్రభుత్వ టీచర్ ద్విచక్రవాహనదారుడు బురాన్‌పల్లి గ్రామానికి చెందిన కొప్పుల మహేందర్ (40)కాగా..వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బర్ల రవి, మరో ఆటో డ్రైవర్ గణేష్‌నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ భూక్య తిరుపతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బోల్తా పడిన ఆటోలను ఎత్తి క్షతగాత్రులను బయటకు తీసి వెంటనే 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. కాగా ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఖమ్మం జాతీయ రహదారిపై అతివేగంగా డ్రైవ్ చేయటం వల్ల ఆటో అదుపు తప్పి ప్రయాణికుల ఆటోతో పాటు బైక్‌ను ఢీకొట్టాడని చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే మామునూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి క్షతగాత్రుల వివరాలు సేకరించినట్లు తెలిసింది.


