టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
● ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
విద్యారణ్యపురి: సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో టీఎస్‌యూటీఎఫ్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులంతా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉపాధ్యాయులు టెట్ గురించి ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు ముందే ఎన్‌సీటీఈ నిబంధనలు 2010 ఆగస్టు 23 కంటే ముందే నియామకమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2023 జూలై నుంచి పీఆర్సీని అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ క్లియర్ చేయాలన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల బెనిఫిట్స్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్, కేజీబీవీల టీచర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జంగయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు, బి.వెంకటరెడ్డి లక్ష్మారెడ్డి, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.కుమార్, సి.సుజన్‌ప్రసాద్‌రావు, చంచాల లింగారావు వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.


