కాసింత సమయం కేటాయిద్దాం..
సమాజంలో అందరూ మనలాగే ఉండరు.. సంతోషంగా బతకాలని ఉన్నా.. అందుకు అవకాశం లేని వారూ ఉన్నారు. మనతోనే సమాజంలో జీవనం సాగిస్తున్నా.. అందరిలా ఆనందం పొందడం లేదు వాళ్లు.. చుట్టూ ఎంత మంది ఉన్నా.. నా అన్న వాళ్లు లేని అనాథలు.. అమ్మానాన్నలకు దూరమైన చిన్నారులు కొందరైతే.. కన్నవారి నిరాదరణకు గురైన అమ్మానాన్నలు మరికొందరు. అసలు సమాజాన్ని చూడలేని అంధులు కొందరైతే.. సాటి మనిషి తోడుంటే తప్ప కదల్లేని దివ్యాంగులు ఇంకొందరు. ఇలా వీరంతా మనలాగే మనుషులు. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మ విశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనసులు.. ఆనందాన్ని పంచే మాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరున్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం ఇవ్వగలిగేవే.. మనం చేసే ఖర్చు.. వెచ్చించే సమయం కొంతైనా వారికి ఆనందాన్నివ్వవచ్చు. కాసింత సమయం కేటాయిద్దామనే ఆలోచనలతో ఎంతో మంది ఆశ్రమాలను సందర్శిస్తూ ఒకపూట ఆత్మీయంగా గడుపుతున్నారు.


