వైద్యుల నిర్లక్ష్యంపై మంత్రి సీరియస్!
పరిపాలనాధికారులపై వేటుకు రంగం సిద్ధం
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో కొన్ని రోజులుగా వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శనివారం ఎలాంటి వైద్య సిబ్బంది సహాయం లేకుండా రెండు, మూడు రోజుల పసికందులను ఆక్సిజన్ సిలిండర్‌తో ఎక్స్‌రేకు తీసుకెళ్లిన ఘటనతో పాటు, కొన్ని రోజులుగా వైద్యసేవల నిర్లక్ష్యంపై మంత్రి స్వయంగా ఆరా తీసినట్లు చర్చించుకుంటున్నారు. ఎంజీఎం ఆస్పత్రిని తక్షణమే గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీని సైతం అదేశించినట్లు వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక నుంచి ప్రతీవారం ఎంజీఎం ఆస్పత్రిపై సమీక్ష నిర్వహించి పేదలకు వైద్యసేవలందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఎంఈ ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తొంది. అలాగే ఎంజీఎం ఆస్పత్రిలో ఏళ్ల తరబడి తిష్టవేసిన మినిస్ట్టీరియల్ సిబ్బందితో పాటు వైద్యసిబ్బంది వివరాల సేకరణకు రంగం సిద్ధమైంది.
ప్రొఫెసర్ల గైర్హాజరే అసలు కారణం
ఎంజీఎం ఆస్పత్రిలోని ప్రతీ విభాగాన్ని పర్యవేక్షించే వైద్యులు హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వస్తూ చుట్టపుచూపుగా సేవలందించడమే ఆస్పత్రిలో సేవల తిరోగమనానికి కారణమని రోగులు పేర్కొంటున్నారు. ప్రొఫెసర్లు విధుల్లోకి రాకపోవడంతో, అసోసియేట్, అసిస్టెంట్లు సైతం విధులపై బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం వల్ల పారామెడికల్ సిబ్బందిలో సైతం నిర్లక్ష్యం పెరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పేద రోగికి అందాల్సిన వైద్యం కోసం ఎంజీఎంలో తీవ్ర పాట్లు పడాల్సిన దుస్థితి నెలకొంది. కలెక్టర్ ఎంజీఎం ఆస్పత్రిపై ఎన్ని సమీక్షలు నిర్వహించినా నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఎంజీఎంలో పేద ప్రజలకు సేవలు అందని దుస్థితి నెలకొంది.


