కంచెలు ఏర్పాటు చేయండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవకుండా కంచెలు ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు సూచించారు. శనివారం నగర పరిధి గొర్రెకుంట కీర్తినగర్ కోటిలింగాల ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటేషన్‌తో పాటు టౌన్‌ప్లానింగ్‌కు చెందిన అంశాలను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ ప్రభుత్వానికి చెందిన ఓపెన్ స్పేస్‌లను గుర్తించాలని ఆక్రమణలకు గురవకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఓపెన్ స్పేస్‌లో బయో కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేయాలని ముఖ్య ఆరోగ్యాధికారికి సూచించారు. గొర్రెకుంట ప్రాంతంలో పర్యటించి ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కీర్తినగర్‌లో మరో 2 ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, వరంగల్ మ్యూజికల్ గార్డెన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఈఈ సంతోశ్‌బాబు, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి డీఈ సతీశ్, టీపీఎస్ శ్రీకాంత్, టీపీబీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.


