విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
విద్యారణ్యపురి: విద్యారంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయాలని, స్కూళ్లను సెమీ రెసిడెన్షియల్‌గా మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఆదివారం నిర్వహించిన విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్‌లో తక్కువగా నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో విద్యారంగం విధ్వంసానికి గురైందన్నారు. గురుకులాలను ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యనభ్యసించే సాధారణ ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాధారణ ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాట్లకు ఉపక్రమించిందని పేర్కొన్నారు. దీంతో విద్యలో మరింత అంతరాలు పెరిగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, అందరికీ సమాన విద్య అందించాలని డిమాండ్ చేశారు. అధ్యాపక జ్వాల సంపాదకురాలు జి.కళావతి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ విలువైన సమయాన్ని యాప్‌లలో అప్‌లోడ్ చేసేందుకు కేటాయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. డీటీఎఫ్ నాయకురాలు ఎస్.అనిత మాట్లాడుతూ విధి నిర్వహణలో మహిళా ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ గంగాధర్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె. నారాయణరెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీ నివాస్ బాధ్యులు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి ఎ.సంజీవరెడ్డి, డి.రమేశ్, వివిధ జిల్లాల బాధ్యులు గోవిందరావు, యాకయ్య, రాంరెడ్డి, తిరుపతి, భాస్కర్, దేవేందర్‌రాజు, ఆదిరెడ్డి మాట్లాడారు.
ఏలూరి సత్యమ్మకు అభినందన
డీటీఎఫ్ హనుమకొండ జిల్లా కౌన్సిలర్ ఏలూరు సత్యమ్మ శ్రీరాములపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఆమెకు ఆదివారం అభినందన సభ నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తిలో సత్యమ్మ నిబద్ధత, అంకితభావంతో పనిచేశారని డీటీఎఫ్ రాష్ట్ర, జిల్లాల బాధ్యులు కొనియాడారు.
విద్యాసదస్సులో డీటీఎఫ్ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి


