‘ఏసీబీ’ దడ.. ‘సైబర్’ వల
అసలేం
జరిగింది..
సాక్షిప్రతినిధి, వరంగల్:
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు రావడంతో కొద్ది రోజుల క్రితం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో దాడులు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరస్తులు నర్సంపేట డివిజన్‌కు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను ఏసీబీ పేరిట బెదిరించి రూ.3.50 లక్షలు వసూలు చేశారు.
ఫిబ్రవరిలో రవాణాశాఖ వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది. ఆ తర్వాత మహబూబాబాద్ కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది. దీంతో రవాణాశాఖ అధికారులు కొందరు ఏసీబీ భయంతో వణికిపోతున్నారని పసిగట్టిన సైబర్ నేరస్తులు.. వరంగల్ ఎంవీఐ, మహబూబాబాద్ ఇన్‌చార్జ్ ఆర్టీఓ తుమ్మల జయపాల్‌రెడ్డిని టార్గెట్ చేయగా, ఆయన రూ.10 లక్షలు సమర్పించుకున్నారు. ఈ నెల 21న మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు.
...అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కొందరు అధికారులకు కంటిమీద కునుకు కరువైంది. కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పలువురు అవినీతి అక్రమాల ఆరోపణలపై ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ ఇరుక్కున్నారు. ఈక్రమంలో ప్రతీ పనికి బాధితుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న కొన్ని శాఖల అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అదునుగా రంగంలోకి దిగుతున్న సైబర్ నేరస్తులు ఆ అక్రమార్కులకు వలవేసి రూ.లక్షలు కొల్లగొడుతుండడం చర్చనీయాంశమవుతోంది.
ఆ ఐదు శాఖలే టార్గెట్..
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా జరిగిన దాడులను పరిశీలిస్తే.. రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్, నీటిపారుదల శాఖలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖలో పని చేసిన ఉన్నతాధికారులు కొందరు ఏసీబీ దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ, వాస్తవానికి రెవెన్యూ, రవాణా, పోలీస్, రిజిస్ట్రేషన్‌శాఖల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని అత్యధికంగా కరప్షన్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలకు తగ్గట్టుగానే ఏసీబీకి చిక్కడం గమనార్హం. డిప్యూటీ తహసీల్దార్ మొదలు ఆర్డీఓ వరకు.. ఎంవీఐ మొదలు డీటీసీ వరకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులపై ఏసీబీ దాడులను ఎదుర్కోవడం అవినీతి అక్రమాలకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. దీంతో వారు ఏసీబీ అధికారులను మచ్చిక చేసుకునేందుకు మార్గాలు వెతుక్కునే క్రమంలో సైబర్ నేరస్తుల వలలో పడి రూ.లక్షలు పోగొట్టుకుంటుండడం చర్చనీయాంశమవుతోంది.
అయినా మార్పులేదు.. రవాణాశాఖలో అదే తీరు
రవాణాశాఖలో ఇన్‌చార్జ్‌ల పాలన ఇంకా కొనసాగుతుంది. ఓ వైపు ప్రక్షాళన జరుగుతున్నా.. మరోవైపు అవినీతి ఊడలు బారుతోంది. కొందరు ఎంవీఐలు ఇన్‌చార్జ్ డీటీఓ కోసం పోటీపడి తెచ్చుకుంటున్నారు. మరికొన్ని చోట్ల జూనియర్లను డీటీఓలుగా తెరమీద పెట్టి తెరవెనుక సీనియర్లు చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టును సీనియర్లు ఉంటే వారికే ఇవ్వాల్సి ఉంది. ఆరోపణలు, ఏసీబీ దాడుల నేపథ్యంలో 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్లు ఉన్నా.. 2012 బ్యాచ్‌కు చెందిన వారిని ఆ పోస్టులో నియమించారు. ఇదిలా ఉంటే చాలాచోట్ల తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు లెర్నింగ్ మొదలు.. ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్, లైట్, గూడ్స్ వాహనాల లైసెన్సుల జారీ, తదితరాలపై అంతకు ముందున్న రేట్లకు రెట్టింపు వసూలు చేయడం ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా వరంగల్ ఘటనతో ‘ఏసీబీ అధికారులు ఎవరికీ ఫోన్ చేయరని.. సైబర్ నేరస్తుల వలలో పడొద్దని.. ఏదైనా ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1064కి ఫోన్ చేయాలి’ అని తాజాగా ఏసీబీ అధికార వెబ్‌సైట్‌లో అలర్ట్ పెట్టింది.
ఏసీబీ తెలంగాణ
వెబ్‌సైట్‌లో అలర్ట్ నోటిఫికేషన్
అవినీతి అధికారులకు కంటిమీద కునుకు కరువు
తాయిలాలతో మచ్చిక
చేసుకునేందుకు అడ్డదారులు
ఇదే అదునుగా రంగంలోకి
సైబర్ నేరగాళ్లు
ఏసీబీ పేరుతో ఫోన్ బెదిరింపులు.. యూపీఐ ద్వారా వసూళ్లు
ఒకేరోజు రూ.10 లక్షలు కాజేత
తాజా బాధితుడు మహబూబాబాద్ ఆర్టీఓ
రూ.10 లక్షలు సైబర్ నేరస్తులకు సమర్పించుకున్న తుమ్మల జయపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు అసలేం జరిగిందన్న వివరాలు ఇలా ఉన్నాయి.. జయపాల్ రెడ్డి వరంగల్‌లో ఎంవీఐగా, మహబూబాబాద్ ఇన్‌చార్జ్ ఆర్టీఓగా వ్యవహరిస్తున్నారు. హనుమకొండ హంటర్‌రోడ్డులో ఉంటున్న ఆయనకు ఈ నెల 15న మధ్యాహ్నం 12.30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి 98868 26656 (ఈ నంబర్ ట్రూ కాలర్‌లో ఏసీబీ అని వస్తుంది) నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను ఏసీబీ (అవినీతి నిరోధక బ్యూరో) నుంచి డీఎస్పీగా పరిచయం చేసుకుని, అవినీతి కేసు నమోదు చేశామని జయపాల్ రెడ్డికి తెలియజేశాడు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని బెదిరించాడు. ఆ తర్వాత కాల్ చేసిన వ్యక్తి ఫిర్యాదుదారుడికి డబ్బులు పంపాలని చెప్పి మొదట రూ.75 వేలు 77606 40948 మొబైల్ నంబర్‌కు బదిలీ చేయమని సూచించాడు. ఆ తర్వాత సైబర్ నేరగాడు చెప్పినట్లు జయపాల్ రెడ్డి రూ.75 వేలతో పాటు మరో రూ.25 వేలు పాయల్ మేఘనకు పంపాడు. అనంతరం మరో రూ.లక్ష పంకజ్ కుమార్‌కు, రూ. 2 లక్షలు దివ్య పేరిట ఉన్న మొబైల్ నంబర్ (97097 65940)కు పంపాడు. మరో రూ.5 లక్షలు బెంగళూరులోని సదాశివనగర్ బ్రాంచ్‌లో ఓ కాంట్రాక్టర్ పేరుతో ఉన్న ఖాతా నంబర్ 477825001010847701 (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: కే ఏఆర్‌బీ0000908)కు పంపాడు. మూడు మొబైల్ నంబర్లు (98868 26656, 95919 38585, 98804 72272) ద్వారా మొత్తం రూ.10 లక్షలు జయపాల్ రెడ్డితో ట్రాన్స్‌ఫర్ చేయించాడు. మోసపోయానని గ్రహించడానికి ఆరు రోజులు పట్టిన జయపాల్‌రెడ్డి చేసేది లేక తెలియని వ్యక్తులపై చర్య తీసుకోవాలని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 318(4) బీఎన్‌ఎస్, 66–డీ ఐటీఏ–2000–2008ల కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
సైబర్ నేరస్తులు
కాజేసిన
రూ.10 లక్షల కథ


