
ఆర్టీఐతో కీలక మార్పులు
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు సమాచార హక్కు చట్టం–2005 అమల్లోకి వచ్చిందని, తద్వారా పాలనలో కీలక మార్పులు వచ్చాయని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో.. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రజలు కోరిన సమాచారం అందించేందుకు పీఐఓ, ఏపీఓలు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించడంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు. హనుమకొండ కలెక్టరేట్ పీఐఓ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా నిలిచినందుకు కలెక్టర్ స్నేహ శబరీష్ అభినందనలు తెలిపారు. అనంతరం సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని జిల్లా అధికారులు, పీఐఓలు, ఏపీఐఓలతో కలెక్టర్ సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వై.వి గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, సీపీఓ సత్యనారాయణరెడ్డి, సమాచార హక్కు చట్టం విషయ నిపుణులు ధరమ్‌సింగ్, జిల్లా స్థాయి అధికారులు, సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్, న్యాయవాది పొట్లపల్లి వీరభద్రరావు, ప్రభుత్వ కార్యాలయాల పీఓలు, ఏపీఐఓలు, అధికారులు పాల్గొన్నారు.