
బాలగోపాల్ గొప్ప మానవతావాది
కేయూ క్యాంపస్: మానవ హక్కుల నేత బాలగోపాల్ రాజ్యాంగాన్ని ప్రజాసాధికారతకు ఆయుధంగా ఉపయోగించి క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను పునర్నిర్మాణం చేసే యత్నం చేశారని, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ( ఏపీసీఎల్‌సీ) తో అనుబంధంగా ఉండి ఖైదీల హక్కుల కోసం, బాధిత కుటుంబాలకు న్యాయ సాయం కోసం నిరంతరం పనిచేశారని హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ (వీసీ) ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీలో సెనేట్‌హాల్‌లో డాక్టర్ కె . బాలగోపాల్ 15వ స్మారకోపన్యాసం ‘కాన్సిటిట్యూషనల్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. బాలగోపాల్ అసాధారణ గొప్ప మానవతావాది అన్నారు. ఆయన రచనలు ఎకామి క్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి పత్రికలో ప్రజాజీవితానికి దగ్గరగా ఉండేవన్నారు. బాల గోపాల్ 21వ శతాబ్దపు ప్రత్యేక బహుమఖ ప్రజ్ఞాశాలి అని అభివర్ణించారు.
బాలగోపాల్ స్ఫూర్తి కొనసాగించాలి..
బాలగోపాల్ దృక్పథం సమాజ కేంద్రంగా ఉంటుందని, దీనిని నేటి యువత కొనసాగించాలని ప్రముఖ సామాజికవేత్త, సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యుడు జి. హరగోపాల్ అన్నారు. ప్రస్తుతం పుస్తక పఠనం తగ్గడం బాధాకరమన్నారు. న్యాక్ మాజీ డైరెక్టర్ ఆచార్య శివలింగప్రసాద్ మాట్లాడుతూ కేయూ గోల్డెన్ జూబ్లీలోకి అడిగిన సమయంలో బాలగోపాల్ స్మారక ఉపన్యాసం నిర్వహించడం అభినందనీయమన్నారు. కేయూ వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ బాలగోపాల్ కేయూ పూర్వ విద్యార్థి, అలాగే పూర్వ అధ్యాపకుడిగా విశ్వవిద్యాలయంలోనూ భాగమయ్యారని గుర్తుచేశారు. కాగా, బాలగోపాల్ రచించిన వివిధ పుస్తకాలను ఆయన సతీమణి వసంత లక్ష్మి, మానవహక్కులనేత జీవన్‌కుమార్ కేంద్ర గ్రంథాలయానికి అందజేశారు. విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సామాజిక ఉద్యమ ప్రతినిధులు పరిశోధకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ
వీసీ శ్రీకృష్ణదేవరావు
కేయూలో బాలగోపాల్ స్మారకోపన్యాసం

బాలగోపాల్ గొప్ప మానవతావాది

బాలగోపాల్ గొప్ప మానవతావాది