
‘స్మార్ట్‌సిటీ’కి డిసెంబర్ డెడ్‌లైన్
వరంగల్ అర్బన్: నగరంలో చేపట్టిన స్మార్ట్‌సిటీ పనులు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి వందశాతం పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్(జీడబ్ల్యూఎస్‌సీసీఎల్) చైర్‌పర్సన్, రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రేటర్ వరంగల్ స్మార్ట్‌సిటీ 29వ బోర్డు సమావేశం మంగళవారం నిర్వహించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్‌సిటీలో పూర్తయి బిల్లులు రాని పనులు, పురోగతిలో ఉన్న వాటి వివరాలను చైర్‌పర్సన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ నిధులకు సంబంధించి బోర్డులో అప్రూవల్ తీసుకున్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు అనుమతి పొందినట్లు వెల్ల డించారు. ఇంకా పూర్తికాని ప్రాజెక్టుల బిల్లుల మంజూరు కోసం అక్టోబర్ వరకు గడువు పొడిగించినట్లు వివరించారు. సమావేశంలో స్మార్ట్ సిటీ బోర్డు సభ్యులు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఫణికుమార్, ఈఎన్‌సీ భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, బల్దియా అధికారులు పాల్గొన్నారు.