
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
● వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: స్థానిక సంస్థల ఎన్నికలు, కౌంటింగ్‌కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఏనుమాముల మార్కెట్ యార్డులో జిల్లాలోని 11 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను మంగళవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండలాల వారీగా బ్యాలెట్ బాక్సులు భద్రపర్చడానికి స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లు పక్కపక్కనే ఉండేలా చూడాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సదుపాయాల కల్పనలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలని పేర్కొన్నారు. నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆమెవెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి ఉన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన..
వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో జిల్లా గోదాములను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. భద్రత చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో డీపీఓ కల్పన, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, హౌసింగ్ పీడీ గణపతి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలు పాటించాలి..
ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలను స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల ప్రింటింగ్ ప్రెస్‌ల యాజమాన్యం కచ్చితంగా పాటించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రింటింగ్, ముద్రణ యాజమాన్యంతో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన పాల్గొన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం –2018 ప్రకారం ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ముద్రణ, ప్రచురణలపై దిశానిర్దేశం చేశారు.