
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
హన్మకొండ కల్చరల్/ హన్మకొండ చౌరస్తా: ఉమ్మ డి వరంగల్ జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి అధి కారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని తన కార్యాలయంలో పురావస్తుశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని చారిత్రక ఆలయాలు, కాకతీయ వారసత్వ సంపదను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. వేయిస్తంభాల దేవాలయంలోని కల్యాణమండపం మరమ్మతులు, విగ్రహప్రతిష్ఠాపన, భద్రకాళి దేవాలయం, చిల్పూరులోని బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్‌పాక ఆలయం, కోటగుళ్లు, రెడ్డిగుడి ప్రత్యేక శిలలపై నిర్మితమైన ఆలయాల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే, వరంగల్ కోటలో ఉన్న 14 ఆలయాల పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం పురావస్తుశాఖ అధికారులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి వేయిస్తంభాల దేవాలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్కియాలజిస్ట్ సూపరింటెండెంట్ నిహిల్ దాస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రోహిణి పాండే, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య