
వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు భవనాల పరిశీలన
కాజీపేట : వరంగల్ నగరంలో పెన్షన్‌దారులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ను మంజూరు చేసింది. ఎంపీ కడియం కావ్య ప్రత్యేక చొరవతో వెల్‌నెస్ సెంటర్‌కు అనుమతి లభించింది. కాగా ట్రైసిటీలోని కాజీపేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న భవనాలతో పాటు హనుమకొండలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, వరంగల్ నగరంలో ఉన్న భవనాలను శుక్రవారం ఎంపీ కావ్య, కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పరిశీలించారు. కాజీపేట సర్కిల్ కార్యాలయం ఆవరణలో గతంలో 30 పడకల ఆస్పత్రికి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉండటంతో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు వెసులుబాటుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
వరంగల్‌చౌరస్తా : తెలంగాణ రాష్ట్ర జాగృతి వరంగల్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా నగరానికి చెందిన నూకల రాణిని నియమిస్తూ వ్యవస్థాపకురాలు కవిత ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించినందుకు రాణి కవితకు కృతజ్ఞతలు తెలిపారు.
వీరన్న సన్నిధిలో
భక్తుల సందడి
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచి ఉన్నారు. దసరా సందర్భంగా వాహన పూజలు అధికంగా జరిగాయి. ఆలయం ఎదుట వాహనాలు బారులుదీరి కనిపించాయి.
రూ.2,50,002 ధర పలికిన దుర్గామాత పట్టుచీర
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని జై భవాని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు అలంకరించిన పట్టుచీరను రూ.2,50,002 కు కాంగ్రెస్ నాయకుడు పద్మం ప్రవీణ్ కుమార్–ధనలక్ష్మి దంపతులు శుక్రవారం దక్కించుకున్నారు. దుర్గామాత భక్తులకు మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చిన సందర్భంలో అలంకరించిన పట్టుచీరను వారు కై వసం చేసుకున్నారు.

వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు భవనాల పరిశీలన