
రుద్రేశ్వరాలయంలో త్రిశూల తీర్థోత్సవం
హన్మకొండ కల్చరల్ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో త్రిశూల తీర్థోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్ రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. గంగు ఉపేంద్రశర్మ శ్రీరుద్రేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం, త్రిశూలం, ఆయుధాలను పూజించిన అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి దేవాలయంలోని ప్రాచీన కోనేరులో శ్రీసూక్తవిధానంతో అవబృధస్నానం, జలాధివాసం నిర్వహించారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీదేవి ఉత్సవమూర్తిని తిరిగి నిత్యపూజా కై ంకర్యాల కోసం దేవాలయంలో రుద్రేశ్వరుడిని సన్నిధిలో ప్రతిష్ఠించారు. త్రిశూల స్నానంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులతోపాటు అమరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మామిడాల గణపతి, కొడిశాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.