హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో జరుగుతున్న రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్‌శర్మ, సందీప్‌శర్మ సుప్రభాతసేవ, స్వామివారికి అభిషేకాలు, ఉత్సవమూర్తికి అభిషేకాలు, చతుషష్టి ఉపచార పూజలు నిర్వహించారు. అనంతరం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని తెలుపు వస్త్రాలు ధరింపజేసి తెల్లకలువలతో పూజలు నిర్వహించారు. భక్తులు సమర్పించిన వివిధ రంగుల గాజులతో అమ్మవారిని అలంకరించారు. యాగశాలలో రుద్రహోమం, సుదర్శన, చండీహోమం నిర్వహించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం దేవాలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.