
గోదావరి ఉగ్రరూపం..
కాళేశ్వరం : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల్లోకి వరద నీరు చేరుతోంది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కరఘాట్లను తాకుతూ 13.240 మీటర్ల ఎత్తులో తరలిపోతుంది. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం తీరంపైగల చిరు దుకాణాల్లోకి వరదనీరు చేరడంతో అధికారులు ఖాళీచేయించారు. ఇప్పటికే నీటిమట్టం 12.210మీటర్ల ఎత్తు దాటగా మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. చివరి ప్రమాదహెచ్చరిక 13.460 మీటర్లు దాటితే జారీ చేస్తారు. రాత్రి వరకు దాటే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలిసింది. దీంతో అధికార యంత్రాంగం దిగువ లోతట్టు గ్రామాలను అప్రమత్తం చేస్తోంది. ఎప్పటికప్పుడు వరద సమాచారం సమీక్షిస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గోదావరి వరదనీరు కమ్మేయడంతో చండ్రుపల్లి, మద్దులపల్లి వాగులు ఉప్పొంగాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
మేడిగడ్డకు..
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 11.37 లక్షల క్యూసెక్కుల వరద తరలివస్తోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తినీటిని దిగువకు తరలిస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్‌లో ఇంత వరద రావడం ఇదే మొదటిసారని ఇరిగేషన్‌శాఖ అధికారులు చెబుతున్నారు.
నీటమునిగిన పంటలు..
మహదేవపూర్ మండలం అన్నారం, చండ్రుపల్లి, నాగేపల్లి, మద్దులపల్లి, పలుగుల, బల్జాపూర్, పూస్కుపల్లి, కాళేశ్వరం, మహదేవపూర్, బొమ్మాపూర్ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు ఈ సీజన్‌లో నాలుగో సారి పంటలు మునిగి నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
పలిమెలలో..
పలిమెల: గోదావరి వరద ప్రవాహానికి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పంట పొలాలు, చేలు నీట మునిగాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేస్తే గోదావరి వరదతో తీరని నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
కాళేశ్వరం వద్ద 13.240 మీటర్ల
ఎత్తున నీటిమట్టం
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన
అధికారులు
వందలాది ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి
పంటలు నీటమునక
ఆందోళనలో రైతులు

గోదావరి ఉగ్రరూపం..