
పండుగకు స్వగ్రామానికి వస్తూ మృత్యుఒడికి..
ఆలేరురూరల్/చిల్పూరు: దసరా పండుగకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కుమారుడితో కలిసి బైక్‌పై వస్తున్న మహిళ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన సోమవారం హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కందిగడ్డతండా శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన సాదం కోమలి(42) తన భర్త రవి, కుమారుడు రాజుతో కలిసి హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటోంది. అక్కడే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కోమలి, ఆమె భర్త రవి కలిసి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దసరా పండుగకు కోమలి, ఆమె కుమారుడు రాజు కలిసి సోమవారం బైక్‌పై హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు మండలం కందిగడ్డతండా శివారులోని ఛత్రపతి శివాజీ దాబా వద్దకు రాగానే అదే మార్గంలో మరో బైక్‌పై వస్తున్న అందె భాస్కర్ వీరి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో కోమలి ఎగిరి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కుమారుడి ఎలాంటి గాయాలు కాలేదు. కోమలిని వెంటనే ఆమె కుమారుడు ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలేరు సీఐ యాలాద్రి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కోమలి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం