
ఆకుకూరలతో ఆరోగ్యం..!
ఆకుకూరలు తోడుంటే ఆరోగ్యమే..
ఖిలా వరంగల్ : ఆధునిక యుగంలో అందరిలోనూ అనారోగ్య సమస్యలు. చిన్న వయసులోనే పలు రోగాలు. అందుకు వైద్యులు చెప్పే సమాధానం ఆహారపు అలవాట్ల మార్చుకోవాలని. ఈ మాట మాంసాహార ప్రియులకు మింగుడు పడకపోయినా.. ఆరోగ్యం కోసం శాఖాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఫలితంగా వరంగల్ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చాలా మంది ఆహారపు అలవాట్లు మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజా ఆకుకూరలపై దృష్టిసారిస్తున్నారు. ఆకుకూరల్లో కేలరీలు తక్కువ ఉండడంతో బరువు నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రొటీన్లను ఆకుకూరల ద్వారా పొందొచ్చు. కొవ్వు తక్కువ ఉండడంతోపాటు ఆహారాన్ని రుచిగా చేయడం ఆకుకూరల ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ప్రతీ రోజు ఆహారంలో ఆకుకూరను తప్పని సరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆకుకూరలతో ఎన్నో ప్రయోజనాలు..
ఆకుకూరలు, కూరగాయలు తినడం ద్వారా ఎలాంటి రోగాలు ధరిచేరవని పలువురు వైద్యులు వెల్లడిస్తున్నారు. వ్యాధులు రాకుండా ఉండాలంటే పిల్ల లకు చిన్నప్పటి నుంచే శాఖాహారం అలవాటు చేయాలని వైద్యులతోపాటు కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకుకూరలో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శారీరక పెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. ఖనిజ పోషకాలు, ఇనుము, కాల్షియం, కెరోటిన్, విటమిన్ ‘సీ’ పుష్కలంగా లభిస్తాయి. ఇనుములోపంతో బాధపడే గర్భిణులు, బాలింతలకు ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ ‘ఏ’ ఉంటుంది. ఇది కంటి చూపును పరిరక్షిస్తుంది. ఐదేళ్లలోపు చిన్నారులు కంటిచూపు ఎక్కువ కోల్పోతున్న తరుణంలో ఆకుకూరలు మేలు చేసి అంధత్వం రాకుండా తోడ్పడతాయి.
చిన్న వయసులోనే జబ్బులు..
నేటి పోటీ ప్రపంచంలో ఆరేళ్ల చిన్నారి నుంచి.. 60 ఏళ్ల వృద్ధుల వరకు పరుగులు పెడుతున్నారు. తద్వారా అతి చిన్న వయసు నుంచే వివిధ రోగాల బారిన పడుతున్నారు. దీనిని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న ప్రజలు మాంసాహారానికి బదులు ఆకుకూరలు, కూరగాయలపై ఆసక్తి చూపుతున్నారు. కాగా, కూరగాయలు తోడుంటే ఆరోగ్యం మీ వెంటే అంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పెరటి కూరలే ఆకుకూరలు..
ఆకు కూరల కోసం ప్రత్యేకంగా కష్టపడాల్సిన పనిలేదు. మార్కెట్ వెంట పరుగులు తీసి కొనుగోలు చేయాల్సిన అవసరమూ లేదు. శ్రద్ధ వహించి ఇంటి ఆవరణలో కొద్దిపాటి ఖాళీ స్థలం ఉన్నా ఎంచక్కా పెంచుకోవచ్చు.
రక్తహీనత నివారణ, కండరాల
పటిష్టతకు దివ్య ఔషధం
కంటి చూపుకు మేలు
ఆకుకూరలు తినాలంటున్న వైద్యులు
ఆకుకూరలు, కూరగాయలు తినడం ద్వారా ఎలాంటి రోగాలు ధరిచేరవు. పిల్లలకు వ్యాధులు రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే శాఖాహారం అలవాటు చేయాలి. నిత్యం మనం తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి రోగ నిరోధక శక్తినిచ్చే ఖనిజ లవణాలు, విటమిన్లు ఆకుకూరల్లో ఉంటాయి. ఇవి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.