
భద్రతపై భయం వద్దు..
వరంగల్ క్రైం: భద్రతపై ప్రజలు భయపడొద్దని హనుమకొండ ఏసీపీ నరసింహారావు సూచించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. శనివారం హనుమకొండ ఏసీపీ పూనాటి నరసింహారావుతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ప్రజలు ఫోన్‌చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ప్రశ్న : గోపాల్‌పూర్‌లో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ కనిపించడం లేదు.
– డాక్టర్ కట్కూరి నరసింహ, గోపాల్‌పూర్
జవాబు: ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తాం. ముఖ్య కూడళ్ల వద్ద చెక్ పాయింట్లు ఉంటాయి. పెట్రోలింగ్ చేసే అధికారి కచ్చితంగా సందర్శించి రిజిస్టర్‌లో సంతకాలు చేస్తారు.
ప్రశ్న : దసరాకు ఊరెళ్తున్నాం.. ఎవరికి సమాచారం ఇవ్వాలి?
– దొమ్మటి భద్రయ్య, రేణుకాఎల్లమ్మ కాలనీ
జవాబు: మీరు ఉంటున్న కాలనీ కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అక్కడకు వెళ్లి వివరాలు ఇవ్వండి. మీ ప్రాంతంలో రాత్రి పూట గస్తీని పెంచుతారు. బీరువా తాళాలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచరాదు. ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలి. దొంగలు కాలనీల్లో తిరిగినప్పటికీ ఇంటికి తాళం వేసినట్లు అనుమానం రాదు.
ప్రశ్న : ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన బైక్ పోయింది. ఇప్పటి వరకు దొరకలేదు. – బండారి శివ, బాలసముద్రం
జవాబు: రోడ్ల మీద వాహనాలను పార్కింగ్ చేయడం సరికాదు. దీంతో వాహనాలు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇంటి ఆవరణలోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలకు తాళాలు ఉంచి మరిచిపోరాదు.
ప్రశ్న : మేం హైదరాబాద్ వెళ్తుండగా బ్యాగు ఎవరో దొంగిలించారు. ఇప్పటి వరకు దొరకలేదు. –సురేశ్, బాలసముద్రం
జవాబు: బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వెంట తీసుకెళ్లిన బ్యాగులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు ఉన్న బ్యాగును ఎట్టి పరిస్థితుల్లో పరిచయం లేని వ్యక్తులకు అప్పగించొద్దు. ముఖ్యంగా మహిళలు ఒంటిమీద ఉన్న నగలపై అప్రమత్తంగా ఉండాలి.
ప్రశ్న : మా కాలనీలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? అనే అనుమానం ఉంది. – జి.కవిత జులైవాడ, పి.రమేశ్ పోస్టల్ కాలనీ
జవాబు: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5,300, కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో 2,500, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 6,400 కెమెరాలు పనిచేస్తున్నాయి. దొంగలను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చే కాలనీ ప్రజలకు పోలీసుల సహకారం ఉంటుంది.
ప్రశ్న : జంక్షన్ల వద్ద ఆకతాయిలు ఉంటున్నారు. బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది?
–రేణుకుంట్ల రమాకాంత్, కుమార్‌పల్లి
జవాబు : కొంతమంది యువకులు పుట్టిన రోజు వేడుకలను రాత్రి పూట రోడ్లపై చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టాం. తీరుమార్చుకోని వారిపై కేసులు కూడా నమోదు చేశాం. ఎవరికై నా ఇబ్బంది కలిగితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి. ఆకతాయిల ఆట కట్టిస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలు రాత్రి పూట ఎక్కడ తిరుగుతున్నారో గమనించాలి.
ప్రశ్న : హనుమాన్ జంక్షన్, డబ్బాల వద్ద ఉదయం పూట ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి సరిచేయండి?
– వెంకటేశ్వర్‌రెడ్డి, హన్‌మాన్ జంక్షన్
జవాబు: కచ్చితంగా ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు అక్కడి సమస్య త్వరలో పరిష్కరిస్తారు.
ప్రశ్న : దొంగతనం జరగకుండా ముందస్తుగా ఎలాంటి
జాగ్రత్తలు తీసుకోవాలి? – డాక్టర్ రహీం, గోపాల్‌పూర్
జవాబు: రెండు మూడు ఇళ్ల వారు కలిిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. స్మార్ట్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు తాళం తీసినా, పగులగొట్టినా వెంటనే ఫోన్‌కు సమాచారం వస్తుంది. దీంతో దొంగలను దొంగతనం చేయకముందే పట్టుకోవచ్చు.
కాలనీల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
సాక్షి ఫోన్ ఇన్‌లో హనుమకొండ ఏసీపీ నరసింహారావు

భద్రతపై భయం వద్దు..