
భద్రకాళికి గంధోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం అమ్మవారిని శ్రీభువనేశ్వరిమాతగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకులు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం, అభిషేకం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి గంధోత్సవం నిర్వహించారు. సాయంత్రం ధూమ్రహా క్రమంలో దుర్గార్చన జరిపి సాలభంజికసేవ నిర్వహించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సతీమణి నందిని భట్టి విక్రమార్క అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు పర్యవేక్షించారు.
మామునూరు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలికల రక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని వరంగల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కందూకూరి పూజ, వరంగల్ జిల్లా మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి హారిక సూచించారు. శనివారం వరంగల్ ఆర్టీఏ జంక్షన్ లెనిన్ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో లీగల్ సర్వీసెస్ అథారిటీ వరంగల్ వారి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ ఓ రమేశ్ అధ్యక్షతన బాల కార్మికులు నిర్మూలన, బాలికలపై జరిగే దాడులు, చట్టపరమైన రక్షణ చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మూగవారిని తక్కువ చేసి చూడరాదని, అవమానించడం చట్టరీత్య నేరమన్నారు. బాల్య వివాహాలు, మహిళలపై హింస వంటి అంశాలను ప్రస్తావించి, చిన్న పిల్లలను చదివించి సమాజానికి మేలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రజిని, అడ్వకేట్ ఎండీ అస్లాం, ఎస్సైలు టి.శ్రీకాంత్, ఎన్.కృష్ణవేణి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లాతో పాటు వరంగల్ రూరల్ జిల్లాలో శుక్రవారం వెలువడిన వైన్స్ టెండర్ల దరఖాస్తులకు ఇంకా బోణీ కాలేదు. శుక్రవారం, శనివారం రెండు రోజులు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
ఖిలా వరంగల్: మధ్యకోట ఖుష్‌మహల్ మైదానంలో అధికారుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించే బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్థానిక కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈబతుకమ్మ సంబురాలకు మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ హాజరవుతున్నట్లు తెలిపారు. మహిళలు పెద్ద బతుకమ్మలతో హాజరై సంబురాలను విజయవంతం చేయాలని కోరారు.
ఖిలా వరంగల్: సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ హెచ్చరించారు. శనివారం వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో సీఐ బొల్ల రమేశ్ ఆధ్వర్యంలో 44 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఎస్పీ హాజరై మాట్లాడుతూ రౌడీషీటర్లు గొడవల్లో తలదూర్చవద్దని, ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరిగేలా సత్ప్రవర్తన కలిగి ఉండాలని హెచ్చరించారు. అనంతరం 44 మంది రౌడీ షీటర్లను తహసీల్దార్ ఇక్బాల్ ఎదుట బైండోవర్ చేశారు. కార్యక్రమంలో ఎస్సైలు శ్రీకాంత్, సురేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

భద్రకాళికి గంధోత్సవం

భద్రకాళికి గంధోత్సవం