
‘సీల్డ్ కవర్’లో నివేదిక!
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్‌లో ఇటీవల ఓ అధికారి మహిళా ఉద్యోగిపై అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె అధికారులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈఘటనపై ఏర్పాటైన ఐసీసీ కమిటీ ఎట్టకేలకు శుక్రవారం సీల్డ్ కవర్‌లో తుది నివేదికను కలెక్టర్‌కు అందజేసినట్లు సమాచారం. అసమగ్ర నివేదికపై కలెక్టర్ స్నేహ శబరీష్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, కలెక్టర్ ఆదేశాలతో కమిటీ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమై తాము సేకరించిన సమాచారం ఆధారంగా తుది నివేదిక రూపొందించి సీల్డ్ కవర్‌లో కలెక్టర్‌లో అందజేసినట్లు తెలిసింది.
పర్యవేక్షణ లేకనేనా..
కలెక్టరేట్‌లో ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఇలాంటి ఘటన జరగడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే సిబ్బంది పనితీరు, జరుగుతున్న వ్యవహారాలపై సరైన పర్యవేక్షణ లేకనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని తెలుస్తోంది. ఒక సెక్షన్‌లో జరుగుతున్న ఘటనలు సిబ్బంది పనితీరు వంటి వ్యవహారాలపై సెక్షన్ సూపరింటెండెంట్లకు కనీస సమాచారం లేకపోవడం నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. కాగా, కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారుల సూచనలు కూడా సూపరింటెండెంట్లు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. డ్యూటీలు ఎప్పుడు ఎక్కడ ఎవరికి కేటాయించాలనే దానిపై స్పష్టత లేకపోవడం కూడా ఇలాంటి ఘటనకు కారణం అవుతుందని కలెక్టరేట్ సిబ్బంది అంటున్నారు. ప్రస్తుత ఘటనతో అయినా పర్యవేక్షకులు కళ్లు తెరిచి పాలనపై పట్టు సాధిస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో లేకుండాపోయింది.
చర్యలపై మీనమేషాలు
కలెక్టరేట్‌లో జరిగిన ఘటనపై బాధితులు స్వయంగా గోడు వెళ్లబోసుకున్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ దాకా వస్తే కానీ తెలియదన్నట్లుగా కొందరు అధికారుల తీరు ఉండడం విమర్శలకు తావిస్తోంది.
సమావేశం ఏర్పాటు చేయండి
ఇప్పటికై నా కలెక్టరేట్ ఉద్యోగులతో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి అంతర్గత సమస్యలపై చర్చించాలని వారి నుంచి సూచనలు స్వీకరించాలని ఉద్యోగులు ఉన్నతాధికారులను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఉద్యోగులకు సూచించినట్లు తెలిసింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల కొంతైనా ఫలితం ఉండొచ్చని ఉద్యోగులు అంటున్నారు.
కలెక్టర్ చర్యలపై ఉత్కంఠ
కలెక్టర్‌కు చేరిన సీల్డ్ కవర్ నివేదికపై ఉద్యోగుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ విషయంలో నిందితుడిని మరొక చోటుకు స్థానచలనం కల్పించిన కలెక్టర్.. నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ప్రస్తుతం నివేదిక చేతికందడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారింది.
ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచేనా?
కలెక్టరేట్ పాలన గాడిన పడేనా?
గుణపాఠం నేర్చుకుంటారా?