
పర్యాటక స్వర్గం
వినోద కేంద్రం.. లక్నవరం
టూరిజం స్పాట్‌గా విరాజిల్లుతున్న ములుగు
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
● పర్యాటకులను ఆకర్షిస్తున్న బొగత
● యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప
● ఆసియాలోనే అతిపెద్ద
ఆదివాసీ జాతర మేడారం
● కనువిందు చేస్తున్న లక్నవరం
● స్వయంభుగా వెలసిన
హేమాచల లక్ష్మీ నరసింహస్వామి
చదువులు.. ఉద్యోగం.. కుటుంబ బాధ్యతలతో నిత్యం సతమతమయ్యే జీవనానికి కాస్త ఉపశమనం కలిగించేది పర్యాటకం.. అయితే ఎక్కడో దూరంగా ఉన్న ప్రదేశాలకు వెళ్లాలంటే వ్యయ ప్రయాసలు తప్పవు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు సమీపంలో ఉండి నిత్యం ఆకర్షిస్తున్న ప్రస్తుత ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల వివరాలతో నేడు(శనివారం) ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
– ములుగు
లక్నవరం సరస్సు
గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ పరిధిలోని లక్నవరం సరస్సు పర్యాటకులకు వినోద కేంద్రంగా మారింది. 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఈ సరస్సు ఐదు వేల ఎకరాల విస్తీర్ణంతో 65 చిన్న కొండల మధ్య 13 ద్వీపాలతో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. సరస్సులోని ద్వీపాలను కలిపే సస్పెన్షన్ బ్రిడ్జిలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకుల వినోదం కోసం సరస్సులో బోటింగ్, బోట్ రైడింగ్, ఐలాండ్‌లోని రిసార్ట్స్, గెస్ట్‌హౌజ్‌లు, క్యాంపు ఫైర్ ఉండడంతో కుటుంబ సమేతంగా వారాంతపు రోజుల్లో ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.