
ఆగిన పెన్షన్
బడ్జెట్‌లో కేటాయించినా..
ఆర్థిక కార్యదర్శిని కలవనున్న వీసీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని టీచింగ్, నాన్‌టీచింగ్, ఫ్యామిలీ పెన్షన్‌దారులకు జూలై, ఆగస్టు నెలల పెన్షన్ గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో జూలైకి సంబంధించిన పెన్షన్‌ను ఆగస్టులో, ఆగస్టు పెన్షన్ సెప్టెంబర్‌లో యూనివర్సిటీ అంతర్గత నిధులనుంచి యూనివర్సిటీ అధికారులు లబ్ధిదారులకు చెల్లించారు.
795 మంది రూ.5.60 కోట్లు
కేయూ పరిధిలో టీచింగ్ సర్వీస్ పెన్షనర్లు 210 మంది, టీచింగ్ ఫ్యామిలీపెన్షనర్లు 57 మంది, నాన్‌టీచింగ్ సర్వీస్ పెన్షనర్లు 296 మంది, నాన్‌టీచింగ్ ఫ్యామిలీ పెన్షనర్లు 232 మంది మొత్తంగా 795 మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.5.60 కోట్ల పెన్షన్ చెల్లించాల్సి ఉంటుంది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి పెన్షన్ గ్రాంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వర్సిటీ నిధుల నుంచి రూ.11.20 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.
యథావిధిగా బిల్లులు
గతంలో మాదిరిగానే సర్వీస్‌లో ఉన్న రెగ్యులర్ అధ్యాపకులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు వేతానా లు, పెన్షనర్ల పెన్షన్ బిల్లులు ప్రతినెలా జిల్లా ట్రెజరీకి పంపుతున్నారు. గతంలో అందరికీ వేతనాలు, పెన్షన్ విడుదల చేయగా.. రెండు నెలలుగా పెన్షన్ నిధులు ఆపేశారు. దీనిపై వర్సిటీ అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.
ఐఎంఎఫ్‌ఎస్‌లో ఉద్యోగుల వివరాలు
రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంట్రిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎంఎఫ్‌ఎస్) నిర్వహిస్తుంది. ఇందులో కాకతీయ యూనివర్సిటీ టీచింగ్, నాన్‌టీచింగ్, అన్నికేటగిరీల ఉద్యోగులకు సంబంధించి వేతనాలతో కూడిన వివరాలు సమర్పిస్తేనే వేతనాల చెల్లింపునకు బ్లాక్ గ్రాంట్ విడుదల చేస్తారని సమాచారం. సెప్టెంబర్ వేతనాలు అక్టోబర్‌లో పొందాలంటే ఆయా ఉద్యోగుల వివరాలు ఐఎంఎఫ్‌ఎస్‌లో నమోదు చేయాల్సిందేనని యూనివర్సిటీకి ఆర్థిక శాఖ సూచించినట్లు తెలిసింది. దీంతో ఆయా ఉద్యోగుల వివరాలు నమోదు చేశారు. ఇందులో పెన్షన్‌దారుల వివరాల నమోదుకు అవకాశ ంలేకపోవడంతో యూనివర్సిటీ అధికారులు మా న్యువల్‌గా పంపించబోతున్నారని సమాచారం. ఈనేపథ్యంలో పెన్షన్ గ్రాంట్ అక్టోబర్‌లోనైనా రిలీ జ్ అవుతుందా.. లేదా.. అనేది సందిగ్ధంగానే ఉంది.
వీసీని కలిసిన కుర్తా బాధ్యులు
రెండు నెలల పెన్షన్ నిధులు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో యూనివర్సిటీ నిధుల నుంచి చెల్లించారు. సెప్టెంబర్ నెల పెన్షన్ దసరా పండుగకు అందుతు ందా.. లేదా.. అనే అంశంపై కేయూ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ (కుర్తా) బాధ్యులు రెండురోజుల క్రితం వీసీ ప్రతాప్‌రెడ్డిని కలిసినట్లు సమాచారం. దసరా నేపథ్యంలో అక్టోబర్ 1నాటికి పెన్షన్ వచ్చేలా చూడాలని వీసీకి విన్నవించినట్లు తెలిసింది.
యూనివర్సిటీలోని రెగ్యులర్ అధ్యాపకులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు కలిిపి నిధుల కోసం యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. దీంతో బ్లాక్ గ్రాంట్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈఏడాది జూన్ వరకు ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేసి చెల్లించింది. కానీ, గత రెండు నెలల నుంచే గ్రాంట్ రిలీజ్ చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి వేతనాలు, పెన్షన్ల కోసం యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించగా ప్రభుత్వం బడ్జెట్‌లోనూ రూ.149కోట్లకుపైగా నిధులను కేటాయించిన విషయం విధితమే. కానీ, ప్రస్తుతం నిధులు విడుదల చేయకపోవడంలో ఆంతర్యమేంటనేది సందిగ్ధంగా మారింది.
నిధులు విడుదల చేయని ప్రభుత్వం
ఆందోళనలో కేయూలోని
వివిధ రకాల పెన్షన్ లబ్ధిదారులు
జూలై, ఆగస్టు నెలల్లో
సర్దుబాటు చేసిన వర్సిటీ
పెన్షన్‌దారులు 795 మంది
ప్రతినెలా రూ.5.60కోట్లు అవసరం
గత రెండునెలలు పెన్షన్ నిలిపివేయడంతో కేయూ అంతర్గత నిధులనుంచి చెల్లిండం ద్వారా వర్సిటీపై భారం పడుతుంది. అక్టోబర్‌లో సైతం పెన్షన్ చెల్లించాలంటే ఇబ్బందులు తప్పవని తెలిసిన వీసీ ప్రతాప్‌రెడ్డి.. ఈనెల 27న రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సందీప్ సుల్తానీయాను కలిసేందుకు వెళ్లినట్లు తెలిసింది. అయితే అక్టోబర్ 1న పెన్షన్ విడుదల చేయకుంటే పెన్షన్ సంఘాలు కార్యచరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.