
స్వయంభుగా వెలసిన హేమాచలుడు
మంగపేట మండలం మల్లూరు గుట్టపై స్వయంభుగా వెలసిన హేమచల లక్ష్మీ నరసింహస్వామి కొరినవారి కోర్కెలు తీర్చే దైవంగా భక్తుల పూజలందుకుంటున్నాడు. మానవ శరీరాన్ని పోలి మెత్తగా ఉన్న నాభి స్వామివారి సొంతమని అర్చకులు పేర్కొంటున్నారు. గుట్టపై బండరాళ్లతో కూడిన గుహలో స్వామి కొలువయ్యాడని, భక్తుల దర్శనార్ధం గుహను తొలగిస్తున్న క్రమంలో స్వామి వారి నాభి వద్ద గాయం ఏర్పడిందని పురాణాల్లో ఉంది. ఈ గాయం నుంచి వచ్చే ద్రవాన్ని గంధంతో కలిపి భక్తులకు నాభి చందన ప్రసాదంగా నేటికీ అర్చకులు అందిస్తుండడం గమనార్హం. నాభి చందన ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అర్ధ చంద్రకారంలో ఉన్న హేమచలకొండ చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. ఆలయ సమీపంలో సహజసిద్దంగా వెలిసిన చింతామణి జలపాతం సంవత్సరం పొడవునా జలధార పారుతూనే ఉంటుంది. ఔషధ గుణాలు కలిగిన చెట్ల వేర్ల నుంచి వచ్చే నీటిని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. తెలంగాణతో పాటు సుమారు ఐదు రాష్ట్రాల నుంచి వందలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు.