
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర.. మేడారం
తాడ్వాయి మండలం మేడారంలో గిరిజనుల కొంగు బంగారమైన సమ్మక్క– సారలమ్మ దేవతలు కొలువై ఉన్నారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. జాతీయ పండుగగా గుర్తించి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. 2026లో జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. జాతర కోసం ప్రభుత్వం రూ.150 కోట్ల నిధులు కేటాయించగా పనులు ప్రారంభమవుతున్నాయి. మేడారం జాతరకు ఈసారి 150 కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. మేడారం అభివృద్ది కోసం మాస్టర్ ప్లాన్‌ను ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించగా, మేడారం గద్దెల ప్రాంతాన్ని సరికొత్తగా రాతితో నిర్మించేందుకు జిల్లాకు చెందిన మంత్రి సీతక్క చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి నదికి ఉపనదిగా జంపన్నవాగు మేడారం ప్రాంతం నుంచే ప్రవహిస్తుండడంతో జాతర సమయంలో కోట్లాదిమంది భక్తులు అందులోనే పుణ్యస్నానాలచరించడం ఆనవాయితీ.