
అనుమానాస్పదస్థితిలో ఆరేళ్ల బాలుడి మృతి
వెంటాడిన మృత్యువు..
కేసముద్రం: అనుమానాస్పదస్థితిలో బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణ పురం గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్‌రాజు తె లిపిన వివరాల ప్రకారం.. పందుల ఉపేందర్, శిరీ ష దంపతులకు ఇద్దరు కుమారులు మనీష్‌కుమార్(6), మోక్షిత్ ఉన్నారు. ఉపేందర్ తన తల్లిదండ్రులు ఎల్లయ్య, మంగమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఎల్లయ్య మేకలు మేపేందుకు ఊరి బయటకు వెళ్లగా, మంగమ్మ పత్తి ఏరడానికి కూలి పనికి వెల్లింది. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉ పేందర్ పని నిమిత్తం వెళ్లాడు. శిరీష తన ఇద్దరు కుమారులతో ఇంటివద్దే ఉంది. సాయంత్రం ఇంట్లో పెద్దకుమారుడు మనీష్‌కుమార్‌ను పడుకోబెట్టి, ఇంటికి కొంతదూరంలో బతుకమ్మ ఆడేందుకు తన చిన్నకుమారుడితో వెళ్లింది. సాయంత్రం కూలి పని కి వెళ్లి వచ్చిన మంగమ్మ తన కోడలు వద్దకు వెళ్లి మ నీష్‌కుమార్ ఎక్కడున్నాడని అడిగింది. జ్వరం వస్తే ఇంట్లో పడుకోబెట్టానని ఆమె తెలిపింది. రాత్రి అ యినా మనీష్‌కుమార్ అలాగే పడుకుని ఉన్నాడు. అన్నం తినిపించడానికి మంగమ్మ మనుమడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా అప్పటికే మనీష్‌కుమార్ మృతి చెంది ఉన్నాడు. దీంతో ఆమె కేకలు పెట్టగా చుట్టుపక్కల వారు వచ్చారు. స్థానిక ఆర్‌ఎంపీ కూడా బాలుడు మృతి చెందినట్లు తెలిపాడు. బాలుడి మెడ కమిలి ఉండడంతో ఉరివేసి గుర్తుతెలియని వ్యక్తులు చంపి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత జూలై 31న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మనీష్‌కుమార్ మెడపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న మనీష్‌కుమార్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. కాగా, సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి నానమ్మ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
నారాయణపురంలో విషాదఛాయలు
ఇటీవల మెడపై కత్తితో దాడి
పందుల ఉపేందర్, శిరీష దంపతులకు ముగ్గురు కుమారులు మనీష్‌కుమార్, మోక్షిత్, నిహాల్ ఉన్నారు. 2025 జనవరి నెలలో ఇంటి ఆవరణంలో ఉన్న నీటిసంపులో పడి చిన్నకుమారుడు నిహాల్ మృతి చెందాడు. ఇప్పుడు పెద్దకుమారుడు మనీష్‌కుమార్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఇలా ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతోంది.