
ఏసీబీ వలలో సైట్ ఇంజనీర్ రమేశ్
● రూ. 8వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్ర విద్య, మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఈడబ్ల్యూ ఐడీసీ)జనగామ సబ్ డివిజన్ సైట్ ఇంజనీర్ (ఔట్ సోర్సింగ్ ) సామల రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలోని జనగామ సబ్ సబ్ డివిజన్ ఆఫీస్‌లో గురువారం ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 8వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారుల(ఏసీబీ)కు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా కొడకండ్ల జెడ్పీహెచ్‌ఎస్‌కు పీఎం శ్రీ పథకం కింద సైన్స్‌ల్యాబ్‌కు రూ. 13లక్షల 50వేలు మంజూరు కాగా గది నిర్మించారు. ఆ నిర్మాణం చేయించినవారికి ఇప్పటికే కొంత బిల్లు ముట్టింది. ఫైనల్ బిల్లు కింద రూ. 3లక్షల 50వేలు చెల్లించాల్సిండగా ఆ బిల్లు ప్రాసెస్ చేసేందుకు ఫార్వర్డ్ చేయడానికి సైట్‌ఇంజనీర్ సామల రమేశ్.. ఆ సైన్స్‌ల్యాబ్ గదిని నిర్మించిన వ్యక్తిని రూ. 18వేల లంచం డిమాండ్‌చేశారు.ఆ వ్యక్తి తొలుత రూ. 10వేలు ఫోన్ పే ద్వారా సైట్ ఇంజనీర్ రమేశ్‌కు కొద్దిరోజుల క్రితం చెల్లింపు చేశారు. మిగతా రూ. 8వేలు చెల్లిస్తేనే ఫైనల్ బిల్లు చెల్లింపునకు సంబంఽధించి ప్రక్రియ పూర్తవుతందని రమేశ్ చెప్పడంంతో అతను (ఫిర్యాదుదారుడు) ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం హ నుమకొండ డీఈఓ కార్యాలయంలో ని టీజీఈడబ్ల్యూ ఐడీసీ జనగామ సబ్‌డివిజన్ ఆఫీస్‌లోనే సైన్స్ ల్యా బ్‌ను నిర్మాణం చేయించిన వ్యక్తి నుంచి రూ.8వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఎల్ రాజు, ఎస్‌రాజు.. రమేశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం జనగామ సబ్‌డివిజన్ టీజీఈడబ్ల్యూ ఐడీసీ కార్యాలయంలో సోదాలు కొనసాగించారు. పలు రికార్డులు పరిశీలించారు. రమేశ్ వరంగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తని, అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా, రమేశ్ ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఆ ఇంజనీరింగ్ విభాగంలోని వివిధ జిల్లాల అఽధికారుల్లో గుబులు రేపుతోంది.