
ఆర్టీసీ ప్రయాణికులకు బహుమతులు
హన్మకొండ: దసరా పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించింది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందించనుంది. ఆర్టీసీ సెమీ డీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీతోపాటు అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారు ఈ లక్కీ డ్రాకు అర్హులు. వరంగల్ రీజియన్ పరిధిలో డ్రా తీసి ముగ్గురికి బహుమతులు అందించనున్నారు. మొదటి బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలుగా ప్రకటించింది. ప్రయాణికులు టికెట్ వెనుక వైపు పేరు, ఫోన్ నంబర్, చిరునామా రాసి బస్ స్టేషన్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్‌ల్లో వేయాలి. వరంగల్ రీజియన్‌లోని హనుమకొండ, వరంగల్, ములుగు, ఏటూరునాగారం, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, జనగామ, పరకాల, భూపాలపల్లి, ఉప్పల్ బస్టాండ్‌లో ప్రత్యేక బాక్స్‌లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బాక్స్‌ల్లో వేసిన టికెట్లను ఒక చోటుకు చేర్చి వరంగల్ రీజియన్ స్థాయిలో డ్రా తీసి విజేతలను ప్రకటించి నగదు బహుమతి అందిస్తారు.