
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన ఉర్సుగుట్ట చుట్టూ ఉన్న విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపణలున్నాయి. గుట్ట సుమారు 29 ఎకరాల విస్తీర్ణంలో ఉంటోంది. దీనికి ఆనుకుని ఉన్న 355 సెర్వే నంబర్‌లో ఎకరం ప్రభుత్వం భూమి ఉంది. గతంలోనే రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూమిగా గుర్తించారు. దీనిపై కలెక్టర్ స్పందించి ప్రహరీ నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేశారు. పనులు ఆలస్యం కావడం.. నగరంలోని ఓ బడా వ్యాపారి గురువారం తన భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కొంత మేర కలిపేసుకునే ప్రయత్నంలో భాగంగా జేసీబీతో చదును చేసే పనులు చేపట్టారు. స్థానికులు గమనించి తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన తహసీల్దార్ ఇక్బాల్ సిబ్బందితో 355 సర్వే నంబర్ భూమి వద్దకు చేరుకుని భూమిని పరిశీలించారు. ఏడీ సర్వే అయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు, పనులు చేపట్టవద్దని హెచ్చరిస్తూ సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. జేసీబీ యంత్రాన్ని అక్కడి నుంచి పంపించారు.