శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
మడికొండ : కాజీపేట మండలం మడికొండ శివారులోని దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో శిక్షణకు ఆసక్తి ఉన్న మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని ప్రాంగణం మేనేజర్ జయశ్రీ ఒక ప్రకటనలో కోరారు. టైలరింగ్, కంప్యూటర్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ కోర్సుల్లో రెండు నెలలపాటు ఉచిత శిక్షణ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చదువు మానేసిన 18 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. కోర్సుకు పదో తరగతి మెమో, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, 4 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో అక్టోబర్ 6 లోపు దరఖాస్తులు అందజేయాలని మేనేజర్ తెలిపారు. పూర్తి వివరాలకు 76600 22525, 7660022526లో సంప్రదించాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ‘మేరా యువ భారత్’ యువజన సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి యువజన సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ సోమవారం తెలిపారు. యువజన సంఘంలోని సభ్యులు 18నుంచి 29 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. చేసుకోలేకపోయినా ఆసక్తి గల యువజన సంఘాల నాయకులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను యువజన సంఘాల పత్రాలతో హనుమకొండలోని న్యూ బస్టాండ్ సమీపంలో మేరా యువ భారత్ కార్యాలయంలో ఈనెల 27వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 0870 29 58776 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
కేయూ ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో పరిశోధకులకు ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు అక్టోబర్ 16 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. అక్టోబర్ 16న పేపర్–1 రీసెర్చ్ మెథడాలజీ, 18న పేపర్–2 ఎలెక్టివ్ పేపర్ (స్పెషలైజేషన్) పరీక్షలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.. పంథినిలో ఘటన
ఐనవోలు : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథినిలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గీత కార్మికుడు సమ్మెల శశికుమార్ (47) కొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల తన కూతురు వివాహం కోసం రూ.6 లక్షలు అప్పు చేశాడు. వ్యవసాయంతోపాటు కూతురు పెళ్లికి చేసిన ఈ అప్పు ఎలా తీర్చాలని భార్యతో చెప్పి మనోవేదనకు గురయ్యేవాడు.
ఈ క్రమంలో సోమవారం కుటుంబీకులు లేని సమయంలో ఇంట్లో ఉరేసుకున్నాడు. పని నిమిత్తం బయటకెళ్లిన ఇంటికొచ్చిన తన భార్య, కూతురు చూసి కేకలు వేశారు. చుట్టు పక్కల వారిని పిలిచి శశికుమార్‌ను కిందికి దింపి ఎంజీఎం తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈఘటనపై మృతుడి భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఐనవోలు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.