
అట్రాసిటి కేసు నమోదు చేయాలి
కలెక్టరేట్ ఘటనపై నోటీసులు
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్‌లో దళిత మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడిని సస్పెండ్ చేయకుండా, కేవలం బదిలీతో సరిపెట్టి నిర్లక్ష్యం వహించడం సరైంది కాదు.. కామాంధుడిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జాతీయ మాల మహానాడు ఉపాధ్యక్షుడు మన్నే బాబూరావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పుట్ట రవి, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ స్నేహశబరీష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత ఉద్యోగులు, మహిళ ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో భద్రత కరువైందని పేర్కొన్నారు. కామాంధుడిపై విచారణ చేపట్టి వారం రోజుల్లో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేయూ జాక్ చైర్మన్ మంద వీరస్వామి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచందర్, డీబీఎఫ్ రాష్ట్ర మహిళ నాయకురాలు బొర్ర సంపూర్ణ, జిల్లా అధ్యక్షుడు కొమ్ముల కరుణాకర్, ప్రధాన కార్యదర్శి మేకల అనిత, నాయకులు నమిండ్ల రవీందర్, రవి కుమార్, అనిల్, మల్లం రాజ్ కుమార్, మాదాసి అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
బదిలీ కాదు వెంటనే సస్పెండ్ చేయాలి
దళిత సంఘాల నాయకులు
పది రోజుల క్రితం కలెక్టరేట్‌లో ఓ మహిళా ఉద్యోగి విషయంలో జరిగిన విషయాలపై ఏర్పాటైన ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ సోమవారం సాయంత్రం సమావేశమైంది. ఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాలపై చర్చించిన ప్రతినిధులు ఫిర్యాదుదారురాలితోపాటు నిందితుడిని కమిటీ ఎదుట హాజరు కావాలని తేదీ, సమయం చెప్పి నోటీసులు జారీ చేశారు. అదే విధంగా తమ వాదనల సమర్థన కోసం వారి వద్ద ఉన్న సాక్ష్యాలు కమిటీకి అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.