
కళలతో మనసుకు ఆనందం
హన్మకొండ కల్చరల్ : కళలు మనసుకు ఎంతో ఆనందం కలిగిస్తాయని, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు జరిగిన కాకతీయ నృత్యనాటకోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ మేరకు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఎంపీ కడియం కావ్య ముఖ్యఅతిఽథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి నాటకోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రవీంద్రభారతికి దీటుగా కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తిచేసి ప్రారంభించిన ఘనత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. అకాడమీ చైర్‌పర్సన్ అలేఖ్య పుంజాల మాట్లాడుతూ కళలను కాపాడేవారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రతీ జిల్లాలో ఇలాంటి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ముందుగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ జీవన సంఘర్షణ పాటలు వినిపించారు. అనంతరం వరంగల్‌కు చెందిన తెలంగాణ డ్రమోటిక్ అసోసియేషన్ కళాకారులు ప్రదర్శించిన రాణి రుద్రమదేవి పద్యనాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాటకసమాజాల రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సదానందం, అకాడమీ ఓఎస్డీ ఆర్. వినోద్‌కుమార్ పర్యవేక్షించారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య
ముగిసిన కాకతీయ నృత్యనాటకోత్సవాలు

కళలతో మనసుకు ఆనందం