
సుంకాన్ని ఎత్తివేయడానికి యూరియా కొరత
ఖిలా వరంగల్/ వరంగల్ చౌరస్తా: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం 11శాతం విదేశీ పత్తి దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడానికే యూరియా కొరత సృష్టించిందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వరంగల్ అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం భవనంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన పత్తి రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత వాణిజ్య విధాన రూపకల్పన సందర్భంగా ఆగస్టు 7న భారత రైతుల ప్రయోజనాలపై రాజీపడబోమని మోదీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో రైతులు, పశుపెంపకందారులు, మత్స్యకారులు రక్షణకు తమ ప్రభుత్వం అడ్డు గోడగా నిలుస్తామని ప్రకటించిందన్నారు. కానీ నాలుగు రోజుల్లోనే ఆగస్టు 19న పత్తి దిగుమతులపై విధిస్తున్న 11 సుంకాన్ని మొదట అక్టోబర్ 21 వరకు పొడిగించిందన్నారు. తద్వారా పత్తి రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి టెక్స్‌టైల్స్ మిల్లు యాజమాన్యాలకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు వ్యవసాయరంగానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్ కె.వెంకట్ నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చేసిన మూడు నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పోరాటాలు చేసి విజయం సాధించామన్నారు. రైతు సంఘం నేతలు రాజయ్య, రామ్మూర్తి, హుస్సేన్, భాస్కర్, నేతి వెంకన్న, నర్సింహ, ఆశాల రెడ్డి, రుద్ర ప్రసాద్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు
హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్