
ఫుడ్ స్ట్రీట్ మేళాను వినియోగించుకోవాలి
వరంగల్ అర్బన్: నగరంలోని వీధి వ్యాపారులు ఫుడ్ స్ట్రీట్ మేళాను వినియోగించుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఫుడ్ స్ట్రీట్ వ్యాపారులకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో ఆహార భద్రత ప్రమాణాలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ హాజరై మాట్లాడారు. కొత్తగా వ్యాపారాలు నిర్వహించుకోవాలనుకునే వ్యాపారులు 17నుంచి అక్టోబర్ 2వతేదీ వరకు నిర్వహించే లోక కల్యాణ్ మేళాలో తమ పేరు నమోదు చేసుకుని అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా మెప్మా పీడీ జోనా, డీఎంసీ రజితరాణి, రమేశ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీపీలకు స్థలాలు గుర్తించండి
సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం 62వ డివిజన్ కాజీపేట ప్రాంతంలో కమిషనర్ స్థలాలను పరిశీలించారు. రహమత్ నగర్‌లో ఎస్టీపీ ఏర్పాటు సాధ్య, సాధ్యాలపై నివేదిక అందజేయాలని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. గ్రీవెన్స్‌లో అందిన సమస్యలపై కమిషనర్ ఆరా తీసి, స్థానికులతో మాట్లాడారు. కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్