
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
హన్మకొండ: ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు ముగ్గురు మంత్రులు బతుకమ్మను, ఆడపడుచులను అవమానపరిచారని, సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంగిలిపూల బతుకమ్మను ఒక మంత్రి సజ్జల బతుకమ్మ అని, మరో మంత్రి సద్దుల బతుకమ్మ అని వ్యాఖ్యానించడంతో పాటు ఆరు గ్యారంటీల పాటలు, రేవంత్ రెడ్డి పాటలు వేసి మహిళలను, బతుకమ్మను అవమానపరిచారన్నారు. సకాలంలో యూరియా లేక పంటలు ఎర్రబారుతున్నాయని, దిగుబడి తగ్గి రైతులు నష్టపోనున్నారన్నారు. దేవుళ్ల మీద రేవంత్ ఒట్టు వేసి మాటతప్పడం వల్లే రాష్ట్రంలో అశాంతి, ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు లక్ష్మీనారాయణ, బీరవెళ్లి భరత్ కుమార్ రెడ్డి, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్ పాల్గొన్నారు.