
సమష్టిగా పోరాడితేనే బీసీలకు రాజ్యాధికారం
హన్మకొండ: బీసీలంతా సమష్టిగా పోరాడితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్ అన్నారు. బుధవారం హనుమకొండ రాంనగర్‌లోని బీసీ భవన్‌లో కుల సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్ మాట్లాడుతూ.. ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతి, 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాల్లో బీసీ కుల సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిటీలు వేసి పటిష్టమైన నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఓబీసీల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలను మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తుగడను ప్రయోగిస్తోందని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను గెలిపించుకుందామన్నారు. సమావేశంలో ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ టి.విజయలక్ష్మి, ఆయా సంఘాల నాయకులు బొనగాని యాదగిరి గౌడ్, పల్లెబోయిన అశోక్ ముది రాజ్, బండారి వివేకానంద, వైద్యం రాజగోపాల్, వేణుమాధవ్‌గౌడ్, తుపాకుల రవి, డాక్టర్ రాము, భిక్షపతి, క్రాంతి, రాజకుమార్ పాల్గొన్నారు.
ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ చైర్మన్
సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్