
‘బిల్డ్ నౌ’ యాప్‌పై అవగాహన సదస్సు
నయీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బిల్డ్ నౌ యాప్‌పై 120 గ్రామాలకు చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, పంచాయతీ రాజ్ సెక్రటరీలతో బుధవారం హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్, పీఓ అజిత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. బిల్డ్ నౌ యాప్ ఏఐ– ఆధారిత సిస్టం ద్వారా భవన నిర్మాణ అనుమతులు నిమిషాల్లో పొందొచ్చని పేర్కొన్నారు. అధికారుల జోక్యం లేకుండా ప్రక్రియను ఆటోమేట్ చేస్తుందని తెలిపారు. ఫోన్‌లోనే బిల్డ్ నౌ యాప్‌ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు పరిశీలించి గరిష్టంగా 15 రోజుల్లో అనుమతి ఇస్తారని తెలిపారు. ఇంటి స్థల విస్తీర్ణం 75 గజాల్లోపు ఉంటే దరఖాస్తు సమర్పించగానే వెంటనే అనుమతి పొందవచ్చన్నారు. ‘కుడా’ ఆఫీస్‌కు రాకుండా ఫోన్ నుంచే ఇంటి నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వాట్సాప్ ద్వారా అప్‌డేట్ అందిస్తూ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం పంపుతుందని వివరించారు.