
అద్దె బస్సుల యజమానులు సహకరించాలి
● ఆర్టీసీ వరంగల్ ఆర్‌ఎం డి.విజయభాను
హన్మకొండ: బతుకమ్మ, దసరా పండుగకు ఇబ్బందుల్లేకుండా ప్రయాణికులను చేరవేయడానికి అద్దె బస్సుల యజమానులు సహకరించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను అన్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఆర్టీసీ అద్దె బస్సు యజమానులు, ఆర్టీసీ అధికారుల జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈసమావేశంలో అద్దె బస్సుల యజమానులు వారి సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఆర్‌ఎం డి.విజయభాను మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రయాణికుల రాకపోకలు పెరుగుతాయని అద్దె బస్సులను కండీషన్‌గా ఉంచాలన్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్, వరంగల్ రీజియన్ అధ్యక్షుపు మారిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరాకు ప్రయాణికులను చేరవేసేందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ఆర్‌ఎం సానుకూలంగా స్పందించారని కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం నాయకులు హబీబుద్దీన్, జె.వెంకట్‌రెడ్డి, జి.వెంకటేశ్వర్లు, కె.సదానందం, ఫర్వేజ్ పాల్గొన్నారు.