
భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేడ్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సూచనలిచ్చారు. ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలన్నారు. కోర్టు కేసులున్న భూములకు సంబంధించి పూర్తి వివరాల్ని వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్, డీఎఫ్‌ఓ లావణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, పరకాల ఆర్డీఓ నారాయణ, వరంగల్ కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్ అగర్వాల్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఏఓ విశ్వప్రసాద్, ఎన్‌హెచ్ మేనేజర్ తదితర అధికారులు పాల్గొన్నారు.