
న్యాయం కోసం ఇంకెన్నాళ్లు?
మహిళా ఉద్యోగిపై
అత్యాచారయత్నం
ఉద్యోగ సంఘాల మౌనం వెనుక?
హన్మకొండ అర్బన్: కలెక్టరేట్‌లో ఓ మహిళా ఉద్యోగిపై ఓ అధికారి కామాంధుడిగా మారి అత్యాచార యత్నానికి పాల్పడిన విషయం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ముందుకొచ్చి ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగులకు తన గోడు వెళ్లబోసుకుంది. తనకు తక్షణ న్యాయం జరుగుతుందని భావించింది. అయితే సోమవారానికి ఈ ఘటన జరిగి 10 రోజులు అవుతోంది. నిందితుడిని కేవలం బదిలీ చేసి, కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఉద్యోగుల్లోని ఓ వర్గం నిందితుడికి వత్తాసు పలుకుతూ, బాధితురాలిపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు వేసిన కమిటీ నాలుగు రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు సమావేశం కాలేదు. దీనికి తోడు కమిటీలో ఉన్న వారిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు 6 నెలల క్రితం ఉద్యోగంలో చేరిన వారే. ఇలాంటివారు మహిళల సమస్యలు విని వారికి న్యాయం చేయడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
న్యాయం జరిగేది ఎప్పుడు?
తనపై అత్యాచారయత్నం జరిగిందని, న్యాయం చేయాలని బాధితురాలు వేడుకున్నా ఇప్పటివరకు కనీసం పోలీసు కేసు కూడా నమోదు చేయకపోవడం, ప్రాథమిక విచారణ చేయక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో సమాచారం సేకరించిన నిఘా వర్గాలు కూడా ఏం జరిగిందన్నది గుర్తించలేదా? గుర్తించినా నివేదిక ఇవ్వలేదా? ఇస్తే దానిపై చర్యలేవి? అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో కోర్టులు, కమిషన్లు, లోకాయుక్త వంటివి స్పందించి సుమోటోగా కేసును స్వీకరించి మొట్టికాయలు వేసే వరకు ఇలాగే కాలయాపన చేస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కలెక్టర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారా?
మహిళా ఉద్యోగుల పక్షపాతి అయిన కలెక్టర్‌ను ఈ విషయంలో అధికారులు, ఉద్యోగులు తప్పుదోవ పట్టిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఘటనను నేరుగా బాధితురాలు కలెక్టర్‌కు వివరించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కమిటీ ఏర్పాటు, నిందితుడి బదిలీ మినహా ఎలాంటి చర్యలు లేవు. సదరు ఉద్యోగిని కనీసం విధుల నుంచి తొలగిస్తారని అంతా భావించారు. కానీ, కొందరి సలహాతో కలెక్టర్ కేవలం బదిలీ చేసి వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సెక్షన్ ప్రక్షాళన జరిగేనా?
కలెక్టరేట్‌లో తీవ్ర విమర్శల పాలైన ఏ–సెక్షన్‌పై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపించింది అనే విమర్శలు ఉన్నారయి. ఈ విషయంలో ఇప్పటికీ కూడా సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఒక సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి తన సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకున్న చాంబర్‌ను తొలగిస్తారా లేదా అని ఐఈడీఓసీ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.
మిగతా వాటి సంగతేంటి?
ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి వ్యవహారాలపై అంతర్గత విచారణకు, అంతర్గత ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటు చేయాల్సిన కమిటీల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ ఘటనతో రుజువైంది. ఈ కమిటీలు ప్రతి ప్రభుత్వ శాఖ, జిల్లా స్థాయిలోనూ ఉండాలి. అంతర్గతంగా పరిశీలన చేస్తూ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి నివేదికలు సిద్ధం చేసి ఇవ్వాలి కానీ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కొద్ది రోజుల కిత్రం కూడా ఇలాంటి ఘటనలు కలెక్టరేట్‌లో జరిగాయి. ఉన్నతాధికారి వద్ద సహాయకుడిగా ఉన్న ఒక సంక్షేమ శాఖ ఉద్యోగి అక్కడే ఉండే ఒక మహిళా సిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే సదరు నిందితుడిపై కంటితుడుపు చర్యలతో వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా పొరుగు జిల్లా నుంచి అనారోగ్య కారణాలతో ఈ జిల్లాకు వచ్చిన రెవెన్యూ శాఖకు సంబంధించిన ఓ మహిళా ఉద్యోగి కుటుంబ సభ్యులతోనూ ఓ ఉద్యోగి ఇలాగే ప్రవర్తించాడని, వారి సమస్య పరిష్కారం విషయంలో బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపణలు వున్నాయి. వీరితోపాటు మరికొందరు బాధితులు ప్రస్తుతం కమిటీ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తంగా దేవాలయం వంటి కలెక్టరేట్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ ఉద్యోగుల్లో సాగుతోంది.
నిందితుడిపై కేసు నమోదులో జాప్యం
బదిలీతోనే సరిపెట్టిన అధికారులు
నోరు మెదపని ఉద్యోగ సంఘాలు
తోటి ఉద్యోగికి చిన్నపాటి సమస్య వచ్చిందంటే హఠాత్తున వాలిపోయే ఉద్యోగ సంఘాలు.. పది రోజులవుతున్నా ఈ విషయంలో కిమ్మనకుండా ఉండడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో మహిళా ఉద్యోగులు భగ్గుమంటున్నారు. అనవసరమైన విషయాల్లో అతిగా స్పందించే కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.